
రాష్ట్రంలోని అటవీప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల దృష్ట్యా అటవీశాఖ ప్రమాదాల నివారణకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. జరిగిన మూడు ప్రమాదాలకు మానవ నిర్లక్ష్యమే కారణమని విచారణలో నిర్ధారణ అయినట్లుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో రక్షిత అటవీప్రాంతాల్లో ప్రవేశంపై ఆంక్షలు విధించింది. నల్లమల మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు అటవీశాఖ సూచనలు పాటించాలంది. అటవీ మార్గాల్లో కాలిబాటల్లో ప్రయాణంపై నిషేధం విధించింది. అడవిలో నిర్దేశిత ప్రాంతాలు, రోడ్ల ద్వారానే ప్రయాణించాలని వెల్లడించింది. అదేవిధంగా అడవిలో నిప్పు రాజేయడం, వంటలు చేసుకోవడంపై నిషేధం విధించింది. ప్రత్యేక విరామ ప్రాంతాల్లో సేద తీరేందుకు అనుమతిచ్చింది. ఈ విరామ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఆమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలు, రక్షిత అటవీప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచుతున్నట్లు అటవీశాఖ పేర్కొంది.