సిగాచి కెమికల్స్‌లో పేలిన రియాక్టర్‌.. ఎనిమిది మంది కార్మికులు మృతి

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలంలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్‌ పార్కులోని సిగాచి కెమికల్స్ (Sigachi Industries) పరిశ్రమలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు మృతిచెందారు. ఘటనా స్థలంలో ఐదుగురు మరణించాగా, దవాఖానలో మరో ముగ్గురురు చనిపోయారు. మరో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు

సోమవారం ఉదయం 6 గంటలకు రియాక్టర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. పేలుడు ధాటికి రియాక్టర్‌ వద్ద పనిచేస్తున్న కార్మికులు100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ప్రొడక్షన్‌ విభాగం కుప్పకూలింది. మరో భవనానికి బీటలు వారింది. ఉదయం షిఫ్ట్‌కు వచ్చిన కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. పేలుడు శబ్ధం వినిపించడంతో కార్మికులు బయటకు పరుగులుతీశారు. మంటల్లో చిక్కుకున్న 50 నుంచి 60 మంది కార్ముకులను బయటకు తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను ప్రైవేటు దవాఖానకు తరలించారు. మిగితా కార్మికుల విషయం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలాన్ని సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పంకజ్ తదితరులు పరిశీలించారు. సహాయక చర్యలో ఫైర్‌, రెవన్యూ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కాగా, ప్రమాదంతో రసాయన పరిశ్రమ పరిసరాలకు ఘాటైన వాసనలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బుందులు పడుతున్నారు. కంపెనీలో ఒడిశా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు పనిచేస్తున్నారు. విధులకు వెళ్లిన కార్మికులకు వారి కుటుంబ సభ్యులు ఫోన్లు చేస్తున్నారు. అయితే కొందరి ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరాతీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.