- పరిశ్రమ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
- ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులను ఆదేశించిన సీఎం..
- చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం
- తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి పాశమైలారం చేరుకున్నారు సీఎం. ప్రమాద స్థలిని పరిశీలించిన ముఖ్యమంత్రి.. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన సీఎం.. సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటించిందా అని ప్రశ్నించారు. సిగాచి పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా అని అడిగారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తనకు తెలియాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించాలన్నారు. ప్రమాదానికి బాధ్యులైన పరిశ్రమ యాజమాన్యం స్పందించిందా అని మరో ప్రశ్న వేశారు. ప్రమాదంపై సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని.. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఊహాజనిత జవాబులు కాకుండా వాస్తవాలను తెలపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించాలన్నారు. కంపెనీలలో లోపాలను గుర్తించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. . సహాయక చర్యలకు సంబంధించి విభాగాల మధ్య సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశం. మృతుల కుటుంబాలకు 1 లక్ష రూపాయలు, గాయపడిన వారికి రూ.50 వేలు తక్షణ సాయంగా అందించాలని ఆదేశించిన సీఎం. ఇది నష్టపరిహారం కాదని, కేవలం తక్షణ సాయం మాత్రమే అని అధికారులకు స్పష్టం చేసిన సీఎం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం. ట్రీట్మెంట్ ఖర్చుకు వెనకాడవద్దని, అవసరమైతే ప్రభుత్వమే వారి ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉందన్న సీఎం. మృతుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివించేలా చూడాలని అధికారులకు ఆదేశం.
పరిశ్రమ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
సిగాచి యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతోందని.. ఘటనాస్థోలికి యాజమాన్యం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధితులకు ఏం భరోసా ఇచ్చారని నిలదీశారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాన్ని మానవతా దృక్పథంతో చూడాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్, పొంగులేటి శ్రీనివాస్ ఘటనాస్థిలిని పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రేవంత్ పరామర్శించనున్నారు.
ఘటనాస్థలి వద్ద మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనాస్థలి వద్ద మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది అత్యంత విషాదకరమైన దుర్ఘటన. ఇప్పటి వరకు ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదు. ఇప్పటి వరకు 36 మంది చనిపోయారు. 143 మంది ఉన్నారు… 58 మందిని అధికారులు గుర్తించారు.. మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించా. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించాను. గాయపడినవారికి మెరుగైన చికిత్సఅందించాలని ఆదేశించాం. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా కంపెనీల్లో పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేయాలని అధికారులను ఆదేశించాను అన్నారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం అన్నారు.
కాగా.. పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. ఘటనాస్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి టీమ్ పాల్గొంది. ప్రమాద సమయంలో 143 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. 34 మందికి తీవ్రగాయాలు అవగా.. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 29 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆరు మృతదేహాల గుర్తించారు. ఇంకా 17 మంది ఆచూకీ గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడ్డారు.
మార్చురీలో గుట్టలుగా పడిన మృతదేహాలు.. కన్నీరు పెడుతున్న కార్మికులు కుటుంబాలు
పటాన్ చెరు ప్రభుత్వ దవాఖాన మార్చురీలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మంగళవారం పటాన్చెరు సర్కారు దవాఖానలోని పోస్టుమార్టం గదిలో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. మార్చురీలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న సిగాచి కార్మికుల మృతదేహాలు చూసి కుటుంబీకులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఏ మృతదేహం ఎవరిదో తెలియక మార్చురీ వద్ద కార్మికుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. డీఎన్ఎ రిపోర్ట్ వచ్చాక వైద్య శాఖ అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.
కాగా, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో (Sigachi Industries) జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రియాక్టర్ పేలుడుతో ఇప్పటివరకు 45 మంది మరణించారు. వివిధ దవాఖానల్లో మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.