- కార్మికుడికి తీవ్రగాయాలు, చికిత్స, పరిస్థితి విషమం
- పరిశ్రమలో భద్రతాలోపమే ఈ పేలుడుకు కారణమా?
- కంపెనీ యజమాన్యంపై పోలీసుల కేసు నమోదు
పాశమైలారం ఫార్మా కంపెనీ పేలుడు ఘటన తరహాలోనే మేడ్చల్ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్ ఫార్మా కంపెనీలో మంగళవారం బాయిలర్ పేలిన ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో షాపూర్‌కు చెందిన కార్మికుడు మూల శ్రీనివాస్‌రెడ్డికి త్రీవగాయాలయ్యాయి. కంపెనీలో పనిచేస్తున్న సమయంలోనే బాయిలర్ పేలడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పేలుడు శబ్దానికి దూరంగా ఉన్న ఇతర కార్మికులు వచ్చి బాధితుడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రసుత్తం అతని పరిస్థితి విషమంగానే ఉన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ శంకర్‌రెడ్డి తెలిపారు.
తొలుత ఈ పేలుడు ఘటనను అల్కలాయిడ్ ఫార్మా కంపెనీ యజమాన్యం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం అనేక అనుమనాలు కలిగిస్తున్నది. కంపెనీలో గత కొన్నేండ్లుగా వినియోగిస్తున్న బాయిలర్‌ను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం మూలంగానే ఈ పేలుడు ఘటన జరిగిందన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు సమయంలో సమీపంలో కార్మికులు ఎవరూ లేని కారణంగా పెనువిపత్తు తప్పింది. ఈ కంపెనీలో 150 మంది షిప్టుల వారీగా విధులు నిర్వర్తిస్తారు. పేలుడు సమయంలో కంపెనీలో 70 మంది పనులు చేస్తున్నట్టు తెలిసింది.
బాయిలర్ వద్ద శ్రీనివాస్‌రెడ్డి ఒక్కడే పనులు చేస్తాడని ఇతర కార్మికుల ద్వారా తెలిసింది. అత్యధిక వేడి వల్లే బాయిలర్ పేలిందని కార్మికులు అనుకుంటున్నారు. కంపెనీలో సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలేదని కార్మికులు, వారి కుటంబాలు ఆరోపిస్తున్నాయి. పాశమైలారం, మేడ్చల్ ఘటనలతో కార్మికులు ఆందోళన చెందున్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు భద్రతా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా ప్రభుత్వం పర్యవేక్షించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.