- ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయలోపం
- లంచాల మత్తులో జోగుతున్న తనిఖీ అధికారులు, సిబ్బంది
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం.. అధికారుల మామూళ్ల మత్తు.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకపోవడం, ఈ అంశాన్ని ప్రశ్నించేనాథుడే లేకుండా పోవడంతో ప్రమాదాలు పరిపాటిగా మారాయి. ప్రభుత్వం సైతం ప్రమాదాలు జరిగినప్పుడే స్పందించి వెంటనే మర్చిపోతుండటం వల్ల ప్రమాదాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నదనే వాదన బలంగా వినిపిస్తున్నది. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు పొరుగున ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తదితర జిల్లాల్లోనే ఎక్కువగా పరిశ్రమలు కేంద్రీకృతమయ్యాయి. రసాయనాలు, ఫార్మా పరిశ్రమలు హైరిస్క్ క్యాటగిరీలో ఉండగా, వీటిపై పర్యవేక్షణ పూర్తిగా కరువైంది.
వాణిజ్యం, పరిశ్రమల శాఖ పరిశ్రమలకు అనుమతులు ఇస్తుంటే, కార్మికశాఖ పరిధిలోని డైరేక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ – బాయిలర్స్ విభాగం కర్మాగారాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షిస్తుంది. కాలుష్య అంశాలను పర్యావరణం, అటవీశాఖ పరిధిలోని కాలుష్య నియంత్రణ మండలి చూస్తుండగా, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలు కార్మికశాఖ పరిధిలో ఉన్నాయి. పరిశ్రమల శాఖ పరిధిలోని ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) కేవలం పారిశ్రామికవాడల్లో మౌలిక సదుపాయాలపైనే దృష్టి పెడతాయి తప్ప కర్మాగారాల్లోని పరిస్థితులపై దృష్టి పెట్టడంలేదు. ఈ నాలుగు అంశాలు వేర్వేరు శాఖల పరిధిలో ఉండగా, వీటి మధ్య ఎటువంటి సమన్వయం లేకుండా పోయింది. ఏనాడూ ఈ శాఖల మధ్య సమన్వయ సమావేశాలు కూడా జరిగిన దాఖలాలు లేవు. దీనికితోడు ఆయా శాఖలను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది.
ముఖ్యంగా కర్మాగారాలను పర్యవేక్షించాల్సిన డైరెక్టరేట్ కార్యాలయంలో తనిఖీలు చేసేందుకు కనీసం 100 మంది ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా, కేవలం 8 మంది మాత్రమే పనిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు నిర్ధారించిన స్టాఫ్ ప్యాట్రన్ ప్రకారం కర్మాగారాలను పర్యవేక్షించేందుకు ఇన్స్పెక్టర్లు కనీసం 16 మంది ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్నవారు కేవలం 8 మంది మాత్రమే. గడచిన ఏడు దశాబ్దాల కాలంలో కర్మాగారాల సంఖ్య గణనీయంగా పెరగగా, ఆ మేరకు స్టాఫ్ ప్యాట్రన్‌ను కూడా ఖరారు చేయకపోవడం గమనార్హం. పెరిగిన కర్మాగారాల సంఖ్యకు అనుగుణంగా కనీసం 100 మంది ఇన్స్పెక్టర్లు అవసరం అవుతారని అధికార వర్గాలు చెప్తున్నాయి.