ఏసీబీ వలలో ‘విద్యాశాఖ’ రికార్డ్ అసిస్టెంట్

సైదాబాద్ పరిధిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేసే రికార్డ్ అసిస్టెంట్ గడ్డం బాబురాజ్ శనివారం మధ్యాహ్నం ఏసీబీ వలకు చిక్కడం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పాఠశాల భవనాన్ని అద్దెకు ఇచ్చిన యాజమాని నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ రికార్డ్ అసిస్టెంట్ గడ్డం బాబురాజ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సైదాబాద్ ఓవైసీనగర్ కి చెందిన గజన్ఫార్ ఆలీ ఖాన్ ప్రభుత్వ పాఠశాలకు తన భవనాన్ని అద్దెకు ఇచ్చాడు. దానికి సంబందించి ఇటీవల రూ. 12 లక్షలు అద్దె కింద విడుదలయ్యాయి. ఈ విషయంలో ఆదాయపన్ను, అద్దె పన్ను సంబంధించి లావాదేవీలలో పదివేల రూపాయలు లంచం అడిగినట్లు ఫిర్యాదు రావడంతో తనిఖీలు నిర్వహించగా లంచం తీసుకున్నట్లు నిరుపితమైనదని తెలిపారు. అలాగే నిందితునిపై కేసు నమోదు చేయడం జరిగిందని, త్వరలోనే స్పెషల్ జడ్జ్ వద్ద హాజరు పరుస్తామని అన్నారు.