- రక్షణ చర్యలు తీసుకోకుండా యథాలాపంగా నడిపిన కంపెనీదా..?
- నిర్లక్ష్యం వహించిన అధికారులదా..?
- సిగాచి పరిశ్రమ లాంటి ఎన్నో పరిశ్రమలను జల్లెడ పట్టాల్సిన అవసరం ఉందా..?
- నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమలు నడుస్తున్నాయా..?
- కఠిన చర్యలు తీసుకుంటేనే దారికొస్తారా..?
కంపెనీ సైరన్ మోగే సమయానికి అంతా ఉత్సాహంగా తాము రోజూ పనిచేస్తున్న ఫ్యాక్టరీలో చేరారు. పొద్దున్నే సద్ధికట్టుకుని వచ్చిన వారు కొందరు… ఇక్కడే టిఫిన్ చేద్దామనుకున్న వారు మరికొందరు.. రోజూలాగు డ్యూటీలో చేరారు. ఇదే తమకు ఆఖరి రోజని.. తమ వారిని ఇక చూడలేమని వారు అనుకోలేదు. అలాగే కుటుంబీకులు కూడా రోజులాగానే వీడ్కోలు పలికినా… సాయంత్రానికి మళ్లీ వస్తారన్న నమ్మకంతో ఉన్నారు. కనీసం కడసారి చూపుకైనా నోచుకోలేని దుస్థితిలో ఇప్పుడు ఉన్నారు. 45 కుటుంబాలు ఛిద్రమయ్యాయి. దీనికి ఎవరు బాధ్యులు. రక్షణ చర్యలు తీసుకోకుండా యథాలాపంగా నడిపిన కంపెనీదా… లేకపోతే, నిర్లక్ష్యం వహించిన అధికారులదా అన్నది తేలాలి. ఏ ప్రమాదం జరిగినా కంటితుడుపు చర్యలు తప్ప కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదు. పాశమైలారం కావచ్చు, ఇండస్ట్రియల్ పార్కుల్లోనే భద్రత డొల్ల అని తేలింది. సరైన భద్రతా ప్రమాణాలు లేకుండానే ఇలాంటి వందల కంపెనీలు నడుస్తున్నాయి. పేరుకే కార్మికశాఖ ఉంది. కార్మికుల గురించి వారు పెద్ద స్పందించరు. హైదరాబాద్ క్రాస్ రోడ్డులో ఉన్న అంజయ్య భవన్ కు వెళితే ఎన్నో దీనగాథలు కనిపిస్తాయి. కార్మికశాఖ మంత్రి కావచ్చు… అసలు మంత్రులకే తమ విధులేమిటో తెలియదు. కేవలం మంత్రి పదవులే. లక్ష్యంగా పెట్టుకుని రాజ్యమేలుతున్నారు. కార్మిక శాఖను చూస్తున్న మంత్రికి ఎన్ని కర్మాగారాలు ఉన్నాయి.. వాటిని సక్రంగా మెయింటెయిన్ చేస్తున్నారా లేదా తెలుసుకునే అవకాశం రాలేదు. ఎందుకంటే ఆయన పదవి చేపట్టి నెల కూడా దాటి ఉండకపోవచ్చు. అలాగని గతంలో పనిచేసిన కార్మిక మంత్రులు ఎవ్వరూ కూడా ఈ ఛాయకు రాలేదు. పదవి ఇచ్చిన రాహుల్ కు కృతజ్ఞతలు చెప్పుకోవడం, ఇతర రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడంతోనే ఆయనకు సరిపోయింది. నిజానికి ఏ మంత్రికీ తమ శాఖలో ఏముందో, ఏం జరుగుతందో తెలియదు. రాజకీయాలు తప్ప మరోటి వారికి తెలియదు. బిజెపి అధ్యక్షుడు ఎవరు.. బిసియా, బ్రాహ్మణుడా అన్న చర్చ చేయడంలోనే మంత్రుల కాలం గడిచింది. చనిపోయినవారిలో ఇప్పుడు ఎందరు బిసిలు, ఎస్సీలు పోయారు, ఎంతమంది అగ్రకులాల వారు తప్పించుకున్నారో ఈ మంత్రులను అడిగి తెలుసుకోవాలి. ప్రాణానికి కులమతం లేదని తెలుసుకోవాలి. అందుకే ప్రమాదానికి గల కారణాలు వెతకాలి. కఠిన చర్యలు తీసుకోవాలి.
ఇలాంటి మరో దుర్ఘటన జరక్కుండా మంత్రి వివేక్ కార్మిక శాఖను అప్రమత్తం చేయాలి. సిగాచి పరిశ్రమ లాంటి సంస్థలను జల్లెడ పట్టాలి. నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమలు నడుస్తున్నాయా లేదా అన్నది పరిశీలించాలి. ఎందుకంటే సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఇలా ఎందుకు జరిగిందన్నది. ప్రాథమిక విచారణ జరగాలి. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారంటే తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వారాయి. సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది. ఇక ఇక్కడ కార్మికులే కాదు.. అందులో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ దుర్మరణం పాలయ్యారు. గోవన్ ప్లాంట్ లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించింది. ప్రమాదంలో కడపజిల్లాకు చెందిన ఓ ప్రేమజంట పెళ్లి చేసుకున్న మధురజ్ఞాపకం మరువకుండానే అనంతలోకాలు పోయారు. మొన్నటికి మొన్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన విషాదం మరువక ముందే ఈ ఘటన జరగడం విచారకరం. పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని కార్మిక మంత్రి వివేక్ తెలిపారు. అధిక పనిగంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషన్ దర్యాప్తు చేస్తుందన్నారు. ఫిర్యాదు చేయడం కాదు… అలా జరుగుతుందా లేదా అన్న విషయం ఆరా తీయాల్సింది కార్మికశాఖనే. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే పౌడర్ తయారు చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఈ సంస్థ పని చేస్తోందని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పలు రసాయన పరిశ్రమల భద్రతపై అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎక్కడైన ప్రమాదం జరిగినప్పుడే యాజమాన్యాలు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. తర్వాత భద్రతా పరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా రసాయన పరిశ్రమలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. రసాయనాల మధ్య ఒత్తిడి పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీకి సంబంధించిన ఇంజినీర్లతో యంత్రాలను తనిఖీ చేయించాలి. జిల్లా అధికారులూ పరిశ్రమలను నిరంతరంగా తనిఖీ చేయాలి. కాలుష్య నియంత్రణ మండలి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి, అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలకు వెళ్తుంటారు. వీరు తనిఖీలు చేసి ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితికి అనుమతులు ఇస్తుంటారు. క్షుణ్ణంగా పరిశీలన చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం పరిశ్రమల నిర్వహణ ఉండాలి. ఇవి కాగితాల్లోనే కనిపిస్తాయి. ప్రతి పరిశ్రమలలో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ వాహనాలు, సిబ్బంది ఉండాలి. అంతేకాదు అగ్నిమాపక సిబ్బందిని వారే నియమించుకోవాలి. ఈ కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేయాలి, కానీ ఒక్కరిని కూడా నియమించు కోలేదు. నైపుణ్యం కలిగిన కార్మికులను తీసుకోవట్లేదు. తక్కువ వేతనాలు ఇస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలనే పనిలోకి తీసుకుంటున్నారు. చిన్నచిన్న ప్రమాదాల బారినపడి కార్మికులు మృతిచెందిన విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇకనుంచి బంద్ కావాలి. క్షేత్రస్తాయిలో ఒక్కో పరిశ్రమను అడుగడుగునా తనిఖీ చేయాలి. నిపుణుల బృందం పరిశీలించాలి. అప్పుడే ప్రమాదాలను కొంతయినా నివారించగలుగుతామని గుర్తించాలి. ప్రమాదలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే మార్పు సాధ్యమవుతుంది. (సోర్స్:AH)