ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బేసిక్‌ నాలెడ్జ్‌ లేదు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బేసిక్‌ నాలెడ్జ్‌ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఆయన 18 నెలలుగా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా రంకెలేస్తున్నారని మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌కు రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదని ఎద్దేవా చేశారు.

రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తే ఆయన చర్చకు రాలేదని, రేవంత్‌ మాట తప్పుతారని తెలిసినా సవాల్‌ను స్వీకరించామని కేటీఆర్ అన్నారు. సీఎం కాకపోయినా కనీసం మంత్రి అయినా చర్చకు వస్తారని అనుకున్నామని చెప్పారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి పోతున్నాయని, రైతులపై సీఎం రేవంత్‌ రెడ్డికి గౌరవం లేదని ఆరోపించారు.

సీఎం ఢిల్లీకి ఎందుకు వెళ్లారని అడిగితే ఎరువుల కోసమని చెబుతున్నారని కేటీఆర్‌ తెలిపారు.
రైతుబంధు అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారని, కొడంగల్‌లో ఎంతమంది రైతులకు రైతుబంధు పడలేదో లిస్ట్‌ రెడీగా ఉందని చెప్పారు. రైతుల మరణాల లిస్ట్‌ కూడా తీసుకొచ్చామని, ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోందని విమర్శించారు.

ఇప్పటికైనా మరోసారి సవాల్‌ చేస్తున్నానని, రేవంత్‌తో చర్చకు సిద్ధమని కేటీఆర్ చెప్పారు. ప్లేస్‌ ఎక్కడో డిసైడ్‌ చేయాలని సవాల్‌ చేస్తున్నానని, డేట్‌ కూడా మీరే ఫిక్స్‌ చేయండని అన్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు. చర్చ కోసం రేవంత్‌ ఇంటికి రమ్మన్నా వెళ్తామని చెప్పారు. రేవంత్‌ స్థాయికి కేసీఆర్‌ అవసరం లేదని, తాము చాలని అన్నారు.

కాంగ్రెస్‌ నేతలకు నిజాయితీ ఉంటే చర్చకు రావాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. కేటీఆర్‌తో చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దని చెప్పారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది యూరియా బస్తాల కోసం కాదని, ఏ బస్తాలు మోసి రేవంత్ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నారో అందరికీ తెలుసని అన్నారు.

రేవంత్ రెడ్డికి రచ్చ చేయటమే తెలుసని, చర్చ చేయటం రాదని విమర్శించారు. ఏ బేసిన్ ఎక్కడుందో తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డని ఎద్దేవా చేశారు. రేవంత్ హయాంలో నీళ్ళు ఆంధ్రకు.. నిధులు ఢిల్లీకి.. నియామకాలు రేవంత్ తొత్తులకు దక్కుతున్నాయని అన్నారు. గురువు చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్ళను ఆంధ్రకు పంపుతున్నారని ఆరోపించారు.

రేవంత్ మోసాలు చేసి నాలుగు రోజులు తప్పించుకోవచ్చని, కానీ ప్రజలు క్షమించరని కేటీఆర్‌ అన్నారు. సవాల్ విసిరి మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటని ఆరోపించారు. 2018లో కొండగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, ఆ తర్వాత మాట తప్పాడని గుర్తుచేశారు.