- ఆస్పత్రిలో మరో ఇద్దరు మృతి.. 44కు పెరిగిన మృతుల సంఖ్య
పటాన్చెరు రూరల్ : ఇటీవల ఘోర ప్రమాదం సంభవించిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఫార్మా ఫ్యాక్టరీని మంగళవారం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) అధికారుల బృందం సందర్శించింది. ప్రమాద స్థలంలో అణువణువు పరిశీలిస్తూ ఘటన వివరాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లా అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రమాదం తీరును బృందం సభ్యులకు వివరించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు కార్మికులు మృతిచెందడంతో ఈ ప్రమాద మృతుల సంఖ్య 44కు చేరింది. బీరంగూడ పనేషియా, పటాన్చెరు ధ్రువ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరిఫ్ (20, బిహార్), అఖిలేశ్వర్ (28, ఉత్తరప్రదేశ్) మంగళవారం మృతిచెందారు. కాగా, గల్లంతైన 8 మంది కార్మికుల జాడ ఇప్పటికీ తెలియలేదు.