మైనింగ్ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర కలెక్టర్లదే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న చర్యల ద్వారా మైనింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  వ్యాఖ్యానించారు. మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసకు అకౌంటబిలిటీ ఉంటుందని ఉద్ఘాటించారు. గతంలో ఇల్లీగల్ మైనింగ్ జరిగేదని విమర్శించారు. ఇవాళ(బుధవారం) ఢిల్లీలో డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ వర్క్‌షాప్‌లో దేశవ్యాప్తంగా గనులు ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల గనుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. మైనింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. డిస్టిక్ మినరల్ ఫౌండేషన్‌కు వచ్చే ఫండ్ మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని వివరించారు. డిస్టిక్ మైనింగ్ ఫౌండేషన్‌కు కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహారిస్తారని తెలిపారు కిషన్‌రెడ్డి.

మూడు రోజుల క్రితం వరకు తెలంగాణలో కూడా మంత్రులే డిస్టిక్ మైనింగ్ ఫౌండేషన్‌కు చైర్మన్లుగా ఉండేవారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం డిస్టిక్ మైనింగ్ ఫౌండేషన్‌కు కలెక్టర్లను చైర్మన్లుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. డీఎంఎఫ్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు భాగస్వాములుగా ఉంటారని స్పష్టం చేశారు. మైనింగ్ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర కలెక్టర్లదేనని ఉద్ఘాటించారు. డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ స్థాపించి పదేళ్లు అయ్యిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.