- నెలన్నర వ్యవధిలో ఏసీబీ వలకు చిక్కిన ఏడుగురు మహిళా అధికారులు
- ఏసీబీ చరిత్రలోనే ఇది అత్యధికం..!
ప్రభుత్వ కార్యాలయాల్లో పురుషులకు దీటుగా మహిళా అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు! ఏసీబీ చరిత్రలోనే తొలిసారిగా.. నెలన్నర వ్యవధిలో ఏడుగురు మహిళా అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. వీరంతా రూ.5 వేల నుంచి రూ.1.2 లక్షల దాకా రకరకాల మొత్తాల్లో లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. వీరిలో పాతికేళ్ల (25) వయసు వారి నుంచి.. పదవీ విరమణ దశలో ఉన్న వారూ ఉండటం గమనార్హం. పట్టుబడిన మహిళా అధికారుల్లో ముగ్గురు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులే. జీహెచ్ఎంసీలోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతి ఏ స్ధాయిలో జరుగుతోందో అనడానికి ఈ అరెస్టులు మచ్చుతునకలు. తాజాగా మంగళవారం మాదాపూర్ డివిజన్‌కు చెందిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఎం.సుధ.. ఒక కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. నాంపల్లిలోని గగన్‌విహార్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో.. హైదరాబాద్ సిటీ రేంజ్ 1 డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి నేతృత్వంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం రిమాండుకు తరలించారు.
అంతకు ముందు..
ఖమ్మం జిల్లాకు చెందిన సబ్ రిజిష్ట్రార్ జె అరుణ డాక్యుమెంట్ రైటర్‌తో కలిసి ఒక గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.30 వేలు తీసుకోవడంతో వారిద్దరినీ మే 26న ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
- మంచిర్యాల తహస్దీలార్ కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్‌గా పనిచేస్తున్న పి.మంజుల, తన వద్ద పనిచేస్తున్న చైన్మన్ మల్లే్‌షతో కలిసి ఒక వ్యవసాయ భూమిని సర్వే చేసి రిపోర్టు ఇవ్వడం కోసం రూ. 26,500 డిమాండ్ చేశారు. అందులో రూ.16,500 రూపాయలను ఫోన్ పే ద్వారా నాలుగు విడతల్లో మల్లేష్ తీసుకున్నాడు, ఆ తర్వాత పదివేల రూపాయలు నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వీరిని జూన్ 4న అరెస్ట్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. మల్లేష్ అసలు చైన్‌మెన్ కాదు, అతని తండ్రి స్ధానంలో పనిచేయడానికి వచ్చాడు. మస్టర్లో అతని తండ్రి పేరుంటే అనధికారికంగా మల్లేష్ ఉద్యోగంలో కొనసాగాడు.
- సంగారెడ్డి జిల్లా బుధేరా గ్రామ పంచాయితీ కార్యదర్శి పి.నాగలక్ష్మి ఇంటి నెంబర్ ఇవ్వడం కోసం రూ.8వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా.. గత నెల 16న ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు.
- జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ)గా పనిచేస్తున్న బి.స్వరూప ఒక కాంట్రాక్టర్ చేసిన పనిని ఎంబీ పుస్తకంలో నమోదు చేయడం కోసం రూ.1,20,000 లంచం అడిగి తీసుకుంటుండగా గత నెల 17న ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
- జీహెచ్ఎంసీలోని నెహ్రూనగర్ సర్కిల్లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న టి.మనీషా ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఒక ఫైల్‌ను పై అధికారికి ఫార్వార్డ్ చేయడం కోసం కాంట్రాక్టర్ నుంచి రూ.5000 తీసుకుంటుండగా గత నెల 23న ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
- జీహెచ్ఎంసీలోని మూసాపేట డివిజన్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఎం.సునీత ఇంటి మ్యూటేషన్‌కు సంబంధించి రూ.30,000 లంచం తీసుకుంటుండగా ఈ నెల 1వ తేదిన ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు