- నిమ్స్‌లో ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించిన మంత్రి దామోదర
- సెక్రటేరియట్‌లో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాప కుటుంబం
తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి దామోదర రాజనర్సింహ చేయూతనందించారు. నిమ్స్‌లో ఆ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయించి ఔదార్యాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు చెందిన చంద్రకాంత్ దంపతులు హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ప్రాంతంలో నివసిస్తూ, అక్కడే ఓ హోటల్‌లో పని చేసుకుంటున్నారు. చంద్రకాంత్ దంపతుల 8 ఏండ్ల పాప ఐశ్వర్య తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో, ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చూపించారు. పాపకు గుండె జబ్బు (Atrial Septal Defect) ఉన్నదని, ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణాలకు ప్రమాదం అని అక్కడి డాక్టర్లు తెలిపారు.
ఆపరేషన్ కోసం కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో చంద్రకాంత్ దంపతులు కుంగిపోయారు. కర్ణాటకకు చెందిన కుటుంబం కావడంతో వారికి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు లేవు. ఆధార్ కార్డు కూడా కర్ణాటకకు చెందినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహని కలిసి, పాప కండీషన్ గురించి తెలియజేసింది. దీంతో చలించిన మంత్రి, పాపను నిమ్స్‌లో అడ్మిట్ చేయించారు. వెంటనే ఆమెకు అవసరమైన ఆపరేషన్ చేయాలని, పూర్తి చికిత్స ఉచితంగా అందించాలని ఆదేశించారు. మంత్రి గారి ఆదేశాలతో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాప ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 4వ తేదీన గుండె వైద్య నిపుణులు గోపాల్, ప్రవీణ్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం పాపకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. పాప పూర్తిగా కోలుకోవడంతో పాపను డిశ్చార్జ్ చేశారు. చంద్రకాంత్ దంపతులు పాపతో వచ్చి గురువారం సెక్రటేరియట్‌లో మంత్రి దామోదర రాజనర్సింహని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పాప ప్రాణాలు కాపాడిన దేవుడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారికి భరోసానిచ్చిన మంత్రి, పాపను అప్యాయంగా పలకరించారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.