కల్తీ కల్లు ఘటనలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య

  • 100 మందికి పైగా బాధితులకు చికిత్స
  • కల్లులో ఆల్ఫ్రాజోలం కలిపినట్టు నిర్ధారణ
  • నగరంలో 4 దుకాణాల లైసెన్సుల రద్దు

కల్తీ కల్లు ఘటనలో గురువారం నాటికి మృతుల సంఖ్య ఏడుకు చేరుకున్నది. వీరి మరణానికి కల్లులో ఆల్ఫ్రాజోలం కలపడమే కారణమని ఎక్సైజ్‌ అధికారులు తేల్చారు. ఈ మేరకు నాలుగు కల్లు దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేసినట్టు తెలిపారు. కూకట్‌పల్లిలోని సాయిచరణ్‌ కాలనీకి చెందిన నర్సమ్మ (54) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ నెల 7న బాలానగర్‌ పరిధిలోని కల్లు దుకాణంలో నర్సమ్మ కల్తీ కల్లు సేవించి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం బాధితురాలిని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ దవాఖానకు తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందింది. బాలానగర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని 5 కల్లు దుకాణాల్లో ఈ నెల 7న దాదాపు 200 నుంచి 300 మంది కల్లు తాగారని, వారిలో ఇప్పటికే 100 మందికి పైగా వివిధ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తున్నది. వీరిలో 38 మందిని గుర్తించి నిమ్స్‌ దవాఖానలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. మిగతావారు కూకట్‌పల్లి, బాలానగర్‌, ఎర్రగడ్డ, సికింద్రాబాద్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

బాలానగర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని కల్లు దుకాణాల నిర్వాహకులు కల్లులో ఆల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థాన్ని కలిపినట్ట ఎక్సైజ్‌ పోలీసులు నిర్ధారించారు. కల్తీకి పాల్పడిన నలుగురిని అరెస్టుచేసి, నాలుగు కల్లు దుకాణాల లైసెన్స్‌లను రద్దుచేశారు. హైదర్‌నగర్‌, హైదర్‌నగర్‌ అనుబంధ షాపు, ఎస్పీ నగర్‌ ఇందిరానగర్‌, భాగ్యనగర్‌ కల్లు కంపౌండ్లలో కల్లు శాంపిళ్లను సేకరించి, రీజినల్‌ కెమికల్‌ ల్యాబ్‌లో పరీక్షించగా, సదరు కల్లు దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం కలిపినట్టు నిర్ధారణ జరిగిందని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

కల్తీ కల్లు బాధ్యులపై చర్యలు: రాజనర్సింహ

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను గురువారం మంత్రి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టిందన్నారు. 31 మంది నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.