ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువ అండర్ టన్నెల్ ( యూటీ) నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేసి రేపటి (సోమవారం )నుంచి 1500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం 10గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాడు ఆయన కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో జరుగుతున్న పాలేరు సాగర్ కాలువ పనులను ఆకస్మికంగా జిల్లా కలెక్టరు అనుదీప్ దురిశెట్టి తో కలిసి తనిఖీ చేశారు
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్‌లో పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జుజ్జులరావు పేట సమీపంలో పాలేరు రిజర్వాయర్ దగ్గర ప్రధాన కాలువపై అండర్ టన్నెల్ ( యూటీ) కొట్టుకపోయిందన్నారు. రైతులకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో అప్పట్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీటిని అందించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో యూటీ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
శాశ్వత ప్రాతిపదికన రూ 14.20 కోట్లతో ఈ యూటీ కాలువ మరమ్మతులను ప్రారంభించడం జరిగిందని ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగానికి జీవనాధారమైన ఈ కాలువ మరమ్మతులను పూర్తిచేసి సాగునీరు అందిస్తాం. దీనివలన ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండగా ఒక్క పాలేరు నియోజకవర్గంలో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రాధాన్యతా క్రమంలో రోజు కు రెండు షిఫ్ట్‌ల క్రమంలో పనిచేసి గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు.
