గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల కుంటాల మండలం నేరడిగొండ పాఠశాలలో 10వ తరగతి
చదువుతున్న కుమారి ఆత్రం త్రివేణి (తండ్రి తులసీరాం) ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని తేదీ 11/7/2025న సాయంత్రం 7.00 PM గంటలకు గమనించబడింది.
తల్లిదండ్రుల సమాచారం ప్రకారం, వేసవి సెలవుల సమయంలో త్రివేణి తలపై కర్ర పడటంతో గాయమైంది. ఆమెను స్థానిక ఆర్ఎంపి వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పట్లో వాంతులు వచ్చినా, ఇచ్చిన మందులతో తాత్కాలికంగా ఆగిపోయాయి. ఆమె 20-06-2025 న పాఠశాల పునఃప్రవేశం చేసింది. అయితే, 11-07-2025 సాయంత్రం 7:00 గంటల సమయంలో, నైట్ స్టడీ సమయంలో ఆమె వాంతులు చేయగా, తీవ్రమైన తలనొప్పి ఉందని తెలియజేయడం జరిగింది. వెంటనే ఆమెను నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు మెరుగైన చికిత్స కోసం ఆమెను రిఫర్ చేశారు. హెడ్ మాస్టర్ మరియు డిప్యూటీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి ఆమెను రాత్రి 9:00 గంటలకు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం 12-07-2025 రాత్రి 1:00 గంటలకు ఆమెను దేవేందర్ రెడ్డి హాస్పిటల్, నిర్మల్ (ప్రైవేట్ ఆసుపత్రి) లో చేర్పించారు. సిటీ స్కాన్ రిపోర్ట్ ప్రకారం ఆమె మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు వైద్యులు తెలియజేశారు. తదుపరి చికిత్స నిమిత్తం అక్కడి వైద్యులు ఆమెను నిమ్స్ హైదరాబాద్ కు రిఫర్ చేశారు. విద్యార్థిని ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోబడి, వెంటనే మెరుగైన వైద్యానికి ఆమెను రిఫరల్ హాస్పిటల్కి తరలించడమైంది. ప్రస్తుతం ఆమె నిమ్స్ హైదరాబాద్లో నిపుణులైన డాక్టర్ల బృందం నిరంతరం అవసరమైన అన్ని పరీక్షలు చేస్తూ మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఆమెతో పాటు తల్లిదండ్రులు మరియు హెడ్ మాస్టర్ కూడా ఉన్నారు.
ఈ రోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి త్రివేణికి వైద్యం అందిస్తున్న డాక్టర్ల బృందంతో మాట్లాడి అవసరమైన అన్ని చికిత్సలు చేసి అమ్మాయి ఆరోగ్యాన్ని కుదుటపర్చండి అన్నారు. అమ్మాయి తల్లితండ్రులతో మాట్లాడి ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా అమ్మాయి ఆరోగ్య రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. ఎ. శరత్, అదనపు సంచాలకులు శ్రీ వి. సర్వేశ్వర రెడ్డి, ఉప సంచాలకులు శ్రీ దిలీప్ వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.