- సమిష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సాధ్యం
- త్వరలో తెలంగాణ పోషకాహార ప్రణాళిక
- భాగస్వామ్య పక్షాల రాష్ట్రస్థాయి సమావేశంలో స్పష్టం చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
షోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాలని పిలపునిచ్చారు. సమిష్టి కృషిలోనే పౌష్టిక తెలంగాణ సాధ్య పడుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు దేశానికే ఆదర్శంగా తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలను తీర్చి దిద్దుతామని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ -2047 డాక్యుమెంట్ కు అనుగుణంగా అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి సేవల బలోపేతం, చిన్నారుల్లో పోషకాహార మెరుగుదల, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం వంటి అంశాలపై రాష్ట్రస్థాయి సమావేశం బేగంపేటలోని టూరిజం ప్లాజా వేదికగా సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మంత్రి సీతక్క అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పోషకారంపై పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, సీఎఫ్‌టిఆర్‌ఐ (మైసూర్), ఎయిమ్స్, ఇక్రిసాట్, యూనిసెఫ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రథం, ఆంధ్ర మహిళా సభ, హర్మన్, బాల రక్షభారతి వంటి స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, పోషకాహారం అందించడంలో లైన్ డిపార్ట్ మెంట్లుగా వ్యవహరిస్తున్న పలు సంక్షేమ శాఖలు, సివిల్ సప్లైస్, విద్యా శాఖ, టీజీ ఫుడ్స్, సెర్ప్, ఐ అండ్ పీఆర్ శాఖల ఉన్నతాధికారులు పాల్గోని తమ విలువైన అభిప్రాయలు తెలియ చేశారు. వారి అభిప్రాయలను, అనుభవాలను, ఆలోచనలను ఆసక్తిగా విన్న మంత్రి సీతక్క వారి సూచనలతో “తెలంగాణ పోషకాహార ప్రణాళిక” రూపొందిస్తామని ప్రకటించారు. అంగన్వాడీ లబ్ధిదారులకు రోజుకు 200 మిల్లీ లీటర్ల విజయ పాలు, కిశోర బాలికలకు పోషకాలతో కూడిన పల్లీ, తృణ ధాన్య పట్టీలు, వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్ఫష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..పోషకాహార తెలంగాణ నిర్మాణం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. నిపుణుల అభిప్రాయాలను, అనుభవాల ఆదారంగా పోషణ తెలంగాణ కోసం కార్యాచరణను రూపొందించి, అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించారు. ప్రజా ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాల సేవల్లో తీసుకొచ్చిన మార్పులను వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీల్లో ఎన్నో పోషకాలున్న కోడిగుడ్డు సరఫరాను నిలపి వేయగా..తెలంగాణలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, కౌమార బాలికలకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిపుణుల సలహ మేరకు అన్ని వయసుల వారికి పౌష్టికాహరం అందించే అంశం పరిశీలనలో ఉందన్నారు. అన్ని రంగాల్లో ముందజలో ఉన్న తెలంగాణలో పోషకార లోపంతో పిల్లలు భాదపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వచ్చంద సంస్థలు, మహిళా స్వయం సహయక బృందాల సహకారాన్ని తీసుకుంటామన్నారు. అంగన్వాడీలపై తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచేలా సేవల నాణ్యత పెంచుతున్నామని చెప్పారు. అమ్మ ఒడి నుంచి చిన్నారులు అంగన్వాడి బడి లో చేరేలా ప్రోత్సహించాలని కోరారు. అంగన్వాడీల్లో ఆహారంతో పాటు అక్షరం, ఆరోగ్యం లభిస్తుందని పేరెంట్స్ కు తెలియ జెప్పాలని సూచించారు.
ఇక నిర్మాణ సౌకర్యం లేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. నాక్, జెన్ ఎన్ టీ యూ వంటి సంస్థలు మోడల్స్ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో వలస కూలీల పిల్లలకు పౌష్టికాహరం అందించేలా మోబైల్ అంగన్వాడీలు నిర్వహిస్తామన్నారు. వారానికి కనీసం రెండు సార్లు అయా ప్రాంతాల్లో పోషకాహారన్ని అందిస్తామని తెలిపారు. ఇక అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆసక్తిని తెలిపిన నేపథ్యంలో అవసరమైన ప్రోత్సాహక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికి ఆరోగ్యవంతమైన చిన్నారులే కీలకమన్నారు. అందుకే అంగన్వాడి కేంద్రాల సేవలపై పూర్తి దృష్టి సారించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అంగన్వాడి సిబ్బంది స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయని పేర్కొన్నారు.
పోషన్ వాటికలో భాగంగా సీడ్స్ కిట్ ఆవిష్కరణ
మంత్రి సీతక్క ప్రత్యేకంగా పోషన్ వాటిక కార్యక్రమం కింద నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఆరు రకాల కూరగాయల విత్తనాలతో కూడిన సీడ్స్ కిట్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మొదటి విడతలో 4,500 అంగన్వాడి కేంద్రాలకు ఈ విత్తనాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో పాలకూర, తోటకూర, మెంతికూర, టమాట, వంకాయ, బెండకాయ విత్తనాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో వీటిని పెంచి లబ్దిదారులకు వండి పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అంగన్ వాడీ సేవల బలోపేతం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి సీతక్క తో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ జీ. సృజన, తెలంగాణ ఫుడ్ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ డీ ఎస్ జగన్, ఇతర శాఖల ఉన్నతాధికారులు, పలు స్వచ్చంద సంస్థల ప్రతినిదులు పాల్గోన్నారు.