అవినీతి నిరోధక సంస్థ(ఏసీబీ) కేసులు ఎదుర్కొంటున్న అధికారులకు విచారణకు పూర్తయ్యే దాకా పోస్టింగులు, పదోన్నతులు ఇవ్వకూడదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) డిమాండ్ చేసింది. ఏసీబీ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరింది. ఈ మేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం ఓ లేఖ రాశారు. ఏసీబీ నమోదు చేసిన కేసుల విచారణలో తీవ్ర జాప్యం నెలకొంటుందని, చాలా కేసులు వీగిపోతున్నాయని ఎఫ్‌జీజీ తెలిపింది. ఫలితంగా ఏసీబీ కేసుల్లో శిక్ష పడుతుందనే భయం అధికారులకు లేకుండా పోయిందని పేర్కొంది. పెద్దపల్లి జిల్లా పంచాయతీరాజ్ ఏఈ జగదీశ్‌బాబు, వాణిజ్య పన్నుల శాఖ డీసీటీఓ డి.శ్రీనివా్‌సరెడ్డిపై ఏసీబీ కేసులు నమోదై, విచారణ కొనసాగుతుండగానే ఫోకల్ పాయింట్లలో పోస్టింగులు, పదోన్నతులు పొందారని తెలిపింది. ఇలాంటి కేసులను దీర్ఘకాలికంగా విచారణలో ఉంచడం వల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని పోస్టింగులు, పదోన్నతులు పొందుతున్నారని వివరించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసుల విచారణ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరింది.
