- మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదిగి మరో 10 మందికి ఉపాధి కల్పించాలి
- మహిళల పేరు మీదే రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల జారీ
- లాభసాటి పామాయిల్ పంట సాగు దిశగా రైతుల దృష్టి సారించాలి
మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుధవారం పెద్దపల్లి పట్టణంలో పర్యటించి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు దాసరి అనసూయ (సీతక్క), ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర సెర్ప్ సిఈఓ డి.దివ్య, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ రాజ్ ఠాకూర్ లతో కలిసి పెద్దపల్లి నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ భీమా, ప్రమాద చెక్కులను పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలు భద్రాచలం, యాదాద్రి, వేములవాడ ఎక్కడికైనా ఉచితంగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంప్, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు.
గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం చేసిన వడ్డి లేని రుణాలను ప్రజా ప్రభుత్వంలో పునరుద్దరించామని అన్నారు. కోటీ మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో సంవత్సరానికి 20 వేల కోట్ల రూపాయల మహిళలకు వడ్డి లేని రుణాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. మొదటి సంవత్సరం 21 వేల 670 కోట్ల రూపాయల వడ్డి లేని రుణాలు అందించామని, 5 సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల వడ్డి లేని రుణాలు అందిస్తామని అన్నారు. మహిళల ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం చల్లగా ఉంటుందని అన్నారు. 93 లక్షల పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా అనేక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల జమ చేశామని అన్నారు. రైతు భరోసా క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి 12 వేల రూపాయలకు పెంచి 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయల జమ చేశామని, రైతు బీమా కు 3 వేల కోట్ల అందించామని అన్నారు. గతంలో అందించిన మంచి కార్యక్రమాలను రెట్టింపు సహాయం ప్రస్తుతం అందిస్తున్నామని అన్నారు. పామాయిల్ పంట పెద్దపెల్లి జిల్లాలో విస్తారంగా పండించాలని, ఎకరానికి నాలుగు సంవత్సరాలలో 51 వేల రూపాయల సబ్సిడీ అందిస్తామని అన్నారు. మొదటి మూడు సంవత్సరాలు అంతర్ పంటలతో ఆదాయం లభిస్తుందని, పామాయిల్ పంటకు మార్కెట్ సమస్య, కోతుల బెడద, కార్మికుల సమస్య ఉండదని అన్నారు. 25 వేల వరకు పామాయిల్ పంటకు ధర లభించేలా కృషి చేస్తున్నామని అన్నారు. పెద్దపల్లిలో తిరుమాలయ కంపెనీ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుందని అన్నారు. రాబోయే నెల రోజులలో సిద్దిపేటలో పెద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మహిళా జీవితాల్లో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ సంబరాలు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలకు దాదాపు 26 వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశామని అన్నారు. మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించడం తో పాటు లోన్ బీమా, ప్రమాద బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. మహిళల ఆదాయం పెంచెందుకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పాడి పశువుల పెంపకం, ఇందిరా శక్తి క్యాంటీన్, ఆర్టిసి కు అద్దె బస్సులు, పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి అనేక మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. మంథని కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో మహిళా సంఘాల ద్వారా మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మహిళల ద్వారా రైతులు పండించిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేశామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు పెద్దపల్లి పట్టణంలో వీ – హబ్ మంజూరు చేశామని, మరో నెల రోజుల్లో దీనిని ప్రారంభిస్తామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంతో విధానపరమైన చర్చలు జరిపి గోదావరి, కృష్ణ నది జలాల్లో మన హక్కులు కాపాడేందుకు, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, అందుకున్న విజయం అందరికి పంచుద్దామనే నినాదంతో మహిళా సంఘాలలో నూతన సభ్యులను చేర్చాలని, 60 సంవత్సరాల దాటిన వారు ప్రత్యేక సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. దివ్యాంగ సంఘం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని మంత్రి అన్నారు. మహిళా సంఘాలకు అందించిన రుణాలు 99 శాతం తిరిగి చెల్లిస్తున్నామని అన్నారు. బ్యాంకులు నేడు మహిళా సంఘాలకు క్యూ కట్టి రుణాలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. గత ఏడాది కంటే 2024-25 సంవత్సరంలో 6 వేల కోట్ల అధికంగా రుణాలు తీసుకున్నామని అన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ వంటి వివిధ వ్యాపారాలు చేయడం వల్ల నెలకు మహిళలకు అదనపు ఆదాయం లభిస్తుందని అన్నారు. ఆర్టిసి కు పెట్టిన అద్దె బస్సు ద్వారా నెలకు 75 వేల రూపాయల ఇస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలు వారికి అందే రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలని మంత్రి తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా మహిళా సంఘాలకు కమిషన్ కింద లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు వరకు వచ్చిందని అన్నారు. 67 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఐక్యంగా ఉండాలని అన్నారు. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల అందిస్తున్నామని అన్నారు. మహిళ సభ్యులు సాధారణంగా మరణిస్తే 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా అమలు అవుతుందని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా నేడు 4 మహిళ సభ్యులకు కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
60 సంవత్సరాల నిండిన వారిని కూడా మహిళా సంఘాలలో చేర్చాలని, 15 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ సంఘంలో ఉండేలా చూడాలని అన్నారు. మహిళా సంఘం సామాజిక భరోసాగా పని చేయాలని అన్నారు. ప్రతి నెలా మహిళా సంఘాల సభ్యులు సమావేశం నిర్వహించాలని అన్నారు. దసరా, దీపావళి పండుగకు ప్రభుత్వం ఉచితంగా చీరల పంపిణీ కోసం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలని, 10 మందికి ఉపాధి కల్పించాలని అన్నారు. సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్ప నూనెతో లడ్లు తయారు చేసి పంపిణీ చేస్తే ప్రధాన మంత్రి సైతం మనకి బాత్ లో పొగిడారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలు డ్రోన్ వ్యాపారం కూడా చేస్తున్నారని, మహిళలు వివిధ రకాలైన వ్యాపారాలు చేసేందుకు ముందుకు రావాలని ధైర్యంగా ఉండాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. జిల్లాలో 16 వేల 800 స్వశక్తి మహిళా సంఘాలకు 15 కోట్ల 74 లక్షల రూపాయలు వడ్డీ సబ్సిడీ కింద ఇప్పటి వరకు విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 67 మంది సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా క్రింద 87 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని అన్నారు.ప్రతి మహిళ సభ్యురాలికి ప్రమాద బీమా, లోన్ బీమా కల్పించామని, ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబ సభ్యులకు 10 లక్షల పరిహారం అందుతుందని, సహజ మరణం పొందితే ఆ సభ్యురాలు పేరిట ఉన్న రుణం గరిష్టంగా 2 లక్షల వరకు మాఫీ అవుతుందని అన్నారు
ఏకరూప దుస్తులు కుట్టడం, ఆర్టిసికు అద్దే బస్సుల ఏర్పాటు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో 2189 మహిళలకు నూతన కుటీర వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం మహిళల ద్వారా నడుస్తున్న 3150 వ్యాపార యూనిట్ల విస్తరణకు సహకారం అందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ సంస్థకు 9 అద్దె బస్సులు పెట్టామని అన్నారు. మంథని, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో పీఎం కుసుమ్ పథకం కింద 2 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా పెద్దపల్లి పట్టణంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే 15 రోజులలో వీ హబ్ క్రింద ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ అందిస్తామని అన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ, వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మరోసారి ప్రవేశపెట్టిందని, మహిళల చేతిలో డబ్బులు ఉండాలని లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. లోన్ బీమా, ప్రమాద బీమా వంటి పథకాలను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించ లేదని అన్నారు. 32 మంది సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా క్రింద 41 లక్షల 69 వేల 873 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం మహిళ సంఘాలకు నాణ్యమైన చీరలు అందించాలని అన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో 4521 మహిళా సంఘాలకు 4 కోట్ల 94 లక్షల రూపాయల వడ్డి లేని రుణాల క్రింద పంపిణీ చేస్తున్నామని అన్నారు. నేడు మహిళా సంఘాలతో బ్యాంకు లింకేజీ కింద 56 కోట్ల 50 లక్షల రూపాయలు, 514 మహిళా సంఘాలకు స్త్రీ నిధి కింద 11 కోట్ల 75 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి ఎలిగేడు, జూలపల్లి, ఓదెల , సుల్తానాబాద్ మండల సమాఖ్యల ద్వారా ఆర్టీసీ సంస్థకు ఏర్పాటు చేసిన అద్దె బస్సుల మొదటి నెల ఆదాయం 3 లక్షల 47 వేల 340 రూపాయలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ , మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. మహిళలే నేరుగా నేడు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తూ 10 మందికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు పి.వేణు, జే. అరుణ శ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, జెడ్పీ సిఈఓ నరేందర్, డిఆర్డిఓ ఎం. కాళిందిని, డిపిఓ వీర బుచ్చయ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ, సంబంధిత అధికారులు, మండల సమాఖ్య సభ్యులు, ఏ.పి.ఎం.లు, మహిళలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.