తెలంగాణలోని పలు సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు

  • లెక్కల్లోచూపని రూ.97,880 నగదు స్వాధీనం

తెలంగాణలోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని బీబీనగర్‌, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిపిన ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.97,880 స్వాధీనం చేసుకున్నారు.

బీబీనగర్‌లో తనిఖీల్లో అకౌంటుకాని రూ. 61,430 నగదు పట్టుబడింది. కార్యాలయం ఆవరణలో అనధికారికంగా 12 మంది ప్రైవేట్‌ ఏజెంట్లు/డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్న ట్టు ఏసీబీ గుర్తించింది. 93 రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు సిబ్బందివద్దనే ఉండటం, ఆఫీసులో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, ప్రభుత్వ రిజిస్టర్లు నిర్వహించకపోవడం కనిపించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

జడ్చర్లలో జమ చేయని రూ.30,900 స్వాధీనం చేసుకున్నారు. 11మంది అనధికారిక డాక్యుమెంట్‌ రైటర్లు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉన్నట్టు గుర్తించారు. 20 రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు కార్యాలయం నుంచి పంపకుండా తాత్సారం చేశారని, ప్రభుత్వ రికార్డులు సక్రమంగా నిర్వహించడంలేదని తేల్చారు. సదాశివపేటలో రూ. 7,500 స్వాధీనం చేసుకోగా.. తొమ్మిది మంది అనధికారిక డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నట్టు తేల్చారు. 39 రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు సిబ్బంది వద్ద ఉన్నాయని అధికారులు తెలిపారు.