రైతుల‌ను ఇబ్బందిపెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • ద‌ర‌ఖాస్తుల తిర‌స్కారానికి స‌రైన కార‌ణాలు చూపాలి
  • ఆగ‌స్టు 15 నాటికి వీలైన‌న్ని భూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
  • ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంలో పేద‌వాడికి ఏస‌మ‌స్యా రాకూడ‌దు
  • ల‌బ్దిదారుల‌కు ద‌గ్గ‌ర‌లోని ఉచిత ఇసుక ఇవ్వాలి
  • జిల్లా క‌లెక్ట‌ర్ల వీడియో కాన్ఫ‌రెన్స్‌లో … రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభార‌తి చ‌ట్టం, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల్సిన బాద్య‌త జిల్లా క‌లెక్ట‌ర్ల‌దేన‌ని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

మంగళవారం నాడు డాక్ట‌ర్ బి. ఆర్. అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో చీఫ్ సెక్రటరీ కార్యాల‌యం నుంచి మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ చీఫ్ సెక్ర‌ట‌రీ కె. రామ‌కృష్ణారావుతో క‌లిసి జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా మంత్రిగారు మాట్లాడుతూ భూ స‌మ‌స్య‌లు పరిష్కార‌మే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అద్భుత‌మైన భూ భార‌తి చ‌ట్టాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేసిన‌ప్పుడే దాని ఫ‌లితాలు సామాన్యుల‌కు అందుతాయ‌ని అన్నారు. మూడు ద‌ఫాలుగా నిర్వ‌హించిన రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించ‌డానికి సామాన్యుల‌ను ముఖ్యంగా రైతుల‌ను ఇబ్బంది పెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సస్సెండ్ చేయ‌డానికైనా వెనుకాడ‌బోమ‌ని హెచ్చ‌రించారు.క్షేత్ర‌స్ధాయిలో కొంత‌మంది అధికారులు రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నార‌నే స‌మాచారం ఉంద‌ని ఇది పున‌రావృతం కాకుండా చూడాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.
రెవెన్యూ స‌ద‌స్సుల్లో 8.65ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని ఇందులో ప్ర‌ధానంగా సాదాబైనామా, స‌ర్వేనెంబ‌ర్ మిస్సింగ్‌, అసైన్డ్ ల్యాండ్ , అసైన్డ్ ల్యాండ్ రెగ్యుల‌రైజేష‌న్‌, సక్సెష‌న్ కు సంబంధించి సుమారు 6 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని వీటిని ఐదు విభాగాలుగా విభ‌జించి ప్ర‌తి ద‌ర‌ఖాస్తును స‌మ‌గ్రంగా ప‌రిశీల‌న జ‌రిపి ఆగ‌స్లు 15వ తేదీలోగా వీలైన‌న్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌న్నారు. సాదాబైనామాల అంశం ప్ర‌స్తుతం కోర్టు ప‌రిధిలో ఉంద‌ని కోర్టు తీర్పుకోసం వేచిచూడ‌కుండా ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ప‌రిష్కారం కోసం సిద్దం చేసుకోవాల‌న్నారు. జిల్లాల్లోని అసైన్డ్‌ల్యాండ్, ల‌బ్దిదారుల వివ‌రాల‌ను ఈ నెల 30వ తేదీ లోగా ప్ర‌భుత్వానికి పంపించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. ద‌ర‌ఖాస్తుల సంఖ్య‌ను త‌గ్గించుకోవ‌డానికి ఇష్టం వ‌చ్చిన రీతిలో తిర‌స్క‌రించ‌కూడ‌ద‌ని, తిర‌స్కారానికి గ‌ల కార‌ణాల‌ను లిఖిత పూర్వ‌కంగా ద‌ర‌ఖాస్తుదారునికి తెలియ‌జేయాల‌ని సూచించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్దాయిలో ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు.

ఈనెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిపీవోల‌కు , జె ఎన్ టి యు ఆధ్వ‌ర్యంలో లైసెన్స్ డ్ స‌ర్వేయ‌ర్ల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నామ‌ని ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను చేసుకొని ప‌క‌డ్బందీగాప‌రీక్ష నిర్వ‌హించాల‌న్నారు.

ఇంటి నిర్మాణంలో పేద‌వాడికి ఏ స‌మ‌స్య రాకూడ‌దు
పేద‌వాడి సొంతింటి క‌ల ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మ‌ణానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని ధ‌ర‌లు, చెల్లింపులు, ఇసుక, సిమ్మెంట్, స్టీల్ విష‌యంలో ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఏ స‌మ‌స్య రాకుండా చూడాల‌ని అలాగే ధ‌ర‌ల నియంత్ర‌ణ కమిటీ చురుగ్గా ప‌నిచేసేలా క‌లెక్ట‌ర్లు నిత్యం ప‌ర్య‌వేక్షించాల‌న్నారు.

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన ఇసుక‌ను ప్ర‌భుత్వం ఉచితంగా అందిస్తుంద‌ని , ఇది స‌రైన విధంగా ల‌బ్దిదారుల‌కు అందేలా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. ల‌బ్దిదారుల‌పై ర‌వాణా భారం అధికంగా ప‌డ‌కుండా వీలైనంత దగ్గ‌ర‌లో ఇసుక అందేవిధంగా చూడాల‌న్నారు. బేస్‌మెంట్ నిర్మాణం కోసం అక్క‌డ‌క్క‌డ అందుబాటులో ఉన్న మ‌ట్టిని తీసుకెళ్తున్న ల‌బ్దిదారుల‌పై పోలీసులు కేసులు న‌మోదుచేయ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని ఇలాంటి చ‌ర్య‌లు పున‌రావృతం కాకుండా క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 జాబితాల‌తో సంబంధం లేకుండా నిరుపేద‌లైతే ఇల్లు కేటాయించాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నాకూడా ప్ర‌తి సోమ‌వారం చెల్లింపులు జ‌రుపుతున్నామ‌ని అయితే సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో కొంత‌మంది ల‌బ్దిదారుల ఖాతాలో డ‌బ్బులు జ‌మ కావ‌డం లేద‌ని ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను ముందుగానే గుర్తించి ల‌బ్దిదారునికి ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు. 2 బిహెచ్‌కే ఇండ్ల‌కు సంబంధించి స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి అర్హులైన ల‌బ్దిదారుల‌కు కేటాయించాల‌న్నారు.