- ఆ గ్రామాల్లో సర్వేమ్యాప్, భూధార్ అమలుకు యోచన
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
దశాబ్దాలుగా రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను ఐదు గ్రామాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రీసర్వేను విజయవంతంగా పూర్తిచేశామని వీలైనంత త్వరితగతిన ఆ ఐదు గ్రామాల్లో సర్వే బౌండరీస్ యాక్ట్ ప్రకారం నక్షా మ్యాప్ నకు తుదిరూపునిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
బుధవారం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో రీసర్వేపై ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి వి. లోకేష్ కుమార్, సర్వే ల్యాండ్‌సెటిల్ మెంట్ కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ నిజాం కాలం నుంచి 413 గ్రామాలకు నక్షాలు లేవని గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఈ గ్రామాలను గాలికి వదిలేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్, జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి ( కొత్తది) , ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాల్లో డ్రోన్ / ఏరియల్ మరియు ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ రోవర్ పద్దతుల్లో సర్వే నిర్వహించామని తెలిపారు.
నిబంధనల ప్రకారం భూ యజమానులకు నోటీసుల జారీ చేయడం, గ్రామ సభలు నిర్వహించి యజమానుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్కరి భూములకు సర్వే హద్దులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ ఐదు గ్రామాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలోపెట్టుకొని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల మనోభావాలు, ఆలోచనలకు అనుగుణంగా వారు సంతృప్తి చెందేవిధంగా నక్షా మ్యాప్ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏం చేసినా అంతిమంగా సామాన్య ప్రజలు, రైతుల సంతోషమే ప్రధానమన్నారు.
భూములు అమ్మకం, కొనుగోలు సందర్భంలో హద్దులతో కూడిన సర్వే మ్యాప్ ను ఖచ్చితంగా జత పరచాలని అలాగే దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో భూములకు కూడా భూదార్ నెంబర్ కేటాయించాలని భూభారతి చట్టంలో స్పష్టం చేయడం జరిగిందని ఈ ఐదు గ్రామాలలో ఈ రెండు అంశాలను అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు.
ఈ ఐదు గ్రామాలలో ఐదు గుంటలకు పైగా ఉన్నభూములకు కొత్తగా సర్వేనెంబర్లు ఇవ్వాలని, అలాగే రెవెన్యూ, ఫారెస్ట్, దేవాదాయ, వక్ప్ భూములు ఉంటే వాటి వివరాలను కూడా రికార్డులలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి, ఐదు గ్రామాలకు చెందిన ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు, సర్వే నిర్వహించిన ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
