పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం మధ్యంతర పరిహారంగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తోంది. బుధవారం తొలి విడతలో 15 కుటుంబాలకు రాష్ట్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సమక్షంలో నగదును బదిలీ చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన 46 మంది కార్మికుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పరిశ్రమ సీఈవో, ఎండీ అమిత్రాజ్ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.
మిగతా మృతుల కుటుంబాలకు కూడా దశలవారీగా మధ్యంతర పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన మరో 8 మంది కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం అందజేస్తామని తెలిపారు. మొదటి విడతలో మొత్తం రూ.5.80 కోట్ల మధ్యంతర పరిహారం అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి పరిహారాన్ని త్వరలోనే అందిస్తామని తెలిపారు.