సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

  • అప్రమత్తంగా ఉండండి.. జిల్లాల్లో పర్యటించండి
  • ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ
  • సంగారెడ్డి నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మంత్రి
  • హైరిస్క్ జోన్లలో ప్రివెంటీవ్ మెజర్స్‌పైన దృష్టి పెట్టాలని ఆదేశం
  • వరద ప్రభావిత ప్రాంతాల నుంచి గర్భిణులను తరలించాలని సూచన
  • హాస్పిటళ్లలో సానిటేషన్‌పై స్పెషల్ ఫోకస్.. పరిశుభ్రత లోపిస్తే కఠిన చర్యలు
  • హాస్పిటల్ క్యాంటీన్లలో తనిఖీలు చేయాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు సూచన
  • ఇంట్లోనే ఫ్రెష్‌గా వండుకుని తినాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి

రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. తక్షణమే జిల్లాలకు వెళ్లి, ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు సంగారెడ్డి పర్యటనలో ఉన్న మంత్రి.. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రివెంటివ్ మెజర్స్‌పైన దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌, మునిసిపల్ డిపార్ట్‌మెంట్లను అలర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో అవేర్‌‌నెస్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో యాంటిలార్వాల్ ఆపరేషన్స్, ఫాగింగ్, ఇండోర్ స్ప్రేయింగ్ విస్తృతంగా చేయాలన్నారు. క్రమం తప్పకుండా మంచి నీటి నమూనాలను పరీక్షించాలన్నారు.

సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున, ఓపీ కౌంటర్లను పెంచాలని, అవసరమైతే ఓపీ టైమింగ్స్‌ను పొడిగించుకోవాలని మంత్రి ఆదేశించారు. అన్నిరకాల మెడిసిన్స్, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్స్‌, టెస్టింగ్ కిట్స్‌ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇన్‌పేషెంట్లు, అవుట్‌ పేషెంట్లకు అవసరమైన అన్ని టెస్టులు హాస్పిటల్స్‌లోనే చేయాలన్నారు. టీ–డయాగ్నస్టిక్ సెంటర్లపై పర్యవేక్షణ పెంచాలని, అన్ని రకాల టెస్టులు చేయడంతోపాటు, అదేరోజు పేషెంట్లకు రిపోర్టులు అందజేయాలన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో సానిటేషన్, డైట్ నిర్వాహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు హాస్పిటళ్లలో తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. హాస్పిటల్స్‌లో వార్డులు, వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా లేకపోయినా, పేషెంట్లకు అందించే ఆహారంలో నాణ్యత లోపించినా హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆర్‌‌ఎంవోలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో జిల్లా, రాష్ట్రస్థాయి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రెగ్యులర్‌‌గా తనిఖీలు చేయాలన్నారు.

ప్రైవేటు హాస్పిటళ్లపై నిఘా పెంచాలని, డెంగీ, ప్లేట్‌లెట్స్‌ పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిల్లులు అధికంగా వేసే హాస్పిటళ్లపై నిబంధనల ప్రకారం వ్యవహరించి, పేషెంట్లను దోచుకోకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయని, ఈ క్రమంలో రైతులు ఎక్కువ సమయం పొలాల్లోనే గడుపుతారని.. ఈ క్రమంలో పాము, తేలు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని మంత్రి హెచ్చరించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకూ అన్ని హాస్పిటళ్లలో పాము, తేలు కాటు పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించేందుకు అవసరమైన మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచుకోవాలన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో‌ వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తూ.. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ దగ్గరలో ఉన్న గర్భిణులను హాస్పిటల్స్‌లోని బర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు తరలించి సేవలందించాలని మంత్రి సూచించారు. అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి పేషెంట్‌ను తరలించేలా‌ డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాలు, గాలుల వల్ల విద్యుత్ అంతరాయం తలెత్తే ప్రమాదం ఉన్నందున, హాస్పిటళ్లలోని జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు

ఇంట్లోనే ఫ్రెష్‌గా వండుకుని తినండి.. ప్రజలకు మంత్రి విజ్ఞప్తి
మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హోటల్స్‌లో ఆహారం తినాల్సి వస్తే, శుభ్రత పాటించే హోటల్స్‌నే ఎంచుకోవాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో హెల్త్‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్‌‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవింద్ర నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు తదితరులు జిల్లాల్లో పర్యటించనున్నారు.