రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు అంచనా వేసేందుకు ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుందని, కావున వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు బృందం ముందస్తు అంచనా వేయటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఙానం మరియు ఇతర వసతులను ఉపయోగించి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల వరకు రాష్ట్రంలో పంటల వారిగా సాగవుతున్న విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటి అమలుకు అవసరమైన నిధులు ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా రానున్న కాలంలో ప్రభుత్వం అమలు చేయనున్న పంటల భీమా పథకానికి సమగ్ర సాంకేతిక పరిజ్ఙానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించాలని విశ్వవిద్యాలయ అధికారులను ఆదేశించారు.
ఇంతకుముందు వివిధ సాంకేతిక సంస్థలతో జరిపిన సంప్రదింపులకు కొనసాగింపుగా జరిగిన ఈ సమావేశంలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము ఇంతకుముందు synthetic aperture data ఆధారంగా స్విట్జర్లాండ్ సంస్థ భాగస్వామ్యంతో కలిసి చేసిన ప్రయోగాలను మరియు ఆ సాంకేతికత ఆధారంగా వానాకాలంలో పంటల నమోదులో వివిధ రాష్ట్రాలలో సాధించిన ఖచ్చితత్వాన్ని మంత్రివర్యులకు తెలియజేశారు.
అంతేకాకుండా వివిధ పంటలను ఆశించు చీడపీడల వివరాలను కూడా సెన్సార్ అమర్చడం ద్వారా ముందుగానే తెలుసుకునే వీలుందని, ఈ దిశగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివిధ పంటలలో ఈ పంటకాలం నుంచే ప్రయోగాలు చేపట్టాలని ఉపకులపతికి మంత్రిగారు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మనకు అందుతున్న వివరాలను బట్టి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా లభించే సమాచారం కంటే కూడా సెన్సార్ల ద్వారా అందే సమాచారం ద్వారా చీడపీడల నివారణ సమర్థవంతంగా నిర్వహించవచ్చని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గౌరవ మంత్రివర్యులకు తెలియజేశారు.
ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ డా. సమీరేండు మోహంతి మరియు శాస్త్రవేత్త డా. టి.ఎల్ నీలిమ, పరిశోధన సంచాలకులు డా. యం బలరాం, డిజిటల్ అగ్రికల్చర్ సెంటర్ డైరెక్టర్ డా. బి. బాలాజీ నాయక్ గారు పాల్గొన్నారు.