సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎస్‌కు ఉన్నతస్థాయి నివేదిక

 సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కి తన నివేదిక సమర్పించింది. కమిటీ తన నివేదికలో ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చేసేందుకు ఇండస్ట్రీయల్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించినట్టు సమాచారం. పారిశ్రామికవాడల్లోనే అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, విపత్తు నిర్వహణ సంస్థలతో వాటిని సమన్వయం చేయాలని పేర్కొంది.

అలాగే, ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఆయా సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వాలని సూచించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక భద్రతా వ్యవస్థలు పరిశ్రమల్లో ఏర్పాటు చేసుకునేలా చేయాలని పేర్కొంది. ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవాడలకు వచ్చే వారి వివరాలు సేకరించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచన చేసింది. ఈ నివేదికపై మంత్రి వర్గంలో చర్చించిన తర్వాత ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించే అవకాశముంది.