కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సమర్పించిన నివేదికపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్ సీ) చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని పీవీఎన్ కాలనీ పరిధిలో ‘మాతా కేటరర్స్’ పేరిట అనధికారిక వాణిజ్య క్యాంటీన్ నిర్వహణతో కాలుష్యానికి కారణమవుతోందని, స్థానికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఇటీవలే పీవీఎన్ కాలనీ వాసులు హుబర్డ్ ప్రెజర్, కె.శ్రీనివాస్, ఎన్.విజయభాస్కర్ రావు, ఎస్.శిరీషలు రాష్ట్ర మానవ హక్కుల కమి షన్ (హెచ్ఆర్ సీ )లో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టి కమిషన్ తెలంగాణ పీసీబీ సభ్య కార్యదర్శికి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అయితే పీసీబీ, ప్రాంతీయ కార్యాలయం సభ్యులు, పర్యావరణ ఇంజినీర్ తయారు చేసిన నివేదికను పంపించారు. అందులో వాణిజ్య వంటగది అంశంపై పీసీబీ పరిధిలోకి రాదని, మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ కు లేఖ పంపించామని ఆ నివేదికలో పేర్కొన్నారు. పీవీఎన్ ప్రజలు చేసిన ఆరోపణలు కేవలం ఊహాజనితమైనవి కాదని, ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే ప్రాథమిక హక్కును నేరుగా ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కానీ పీసీబీ నిర్లక్ష్యంగా నివేదికను సమర్పించడం పట్ల కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటన వాస్తవాలు, పరిస్థితులను పరిగణలోకి తీసుకొని రెండు నెలల్లో మల్కాజిగిరి పీవీఎన్ కానీ పరిధిలో కాలుష్యాన్ని అరికట్టాడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు.
