ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సచివాలయంలో చేనేత జౌళిశాఖ పథకాల అమలు తీరును జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 7 న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేపట్టబోయే వేడుక ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భారతీయ సంస్కృతిలో పట్టు, కాటన్, చేనేత వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదు. నేటితరం యువత కూడా చేనేత ఉత్పత్తులను ఆదరించడం విశేషం. చేనేత రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయ చేనేతలైన గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, ఆర్మూర్ పితాంబరీ, మహదేవ్ పూర్ టస్సర్ పట్టుచీరలు, డ్రెస్ మెటీరియల్స్, వరంగల్ దర్రిస్, కరీంనగర్ బెడ్ షీట్లు, ఆలంపూర్ టవల్స్, దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరుగాంచాయి. వీటిని కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే వస్త్ర ప్రదర్శనలో ఆయా చేనేత సంఘాల ద్వారా ప్రదర్శించాలని మంత్రిగారు సూచించారు. మార్కెట్ డిమాండుకి అనుగుణంగా మరియు మార్కెట్లో పోటిపడే విధంగా క్వాలిటీ వస్త్రాలను చేనేత సంఘాలు ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

చేనేత రుణమాఫీ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి, వారి ఖాతాలలో రుణమాఫీ నిధులు జమ చేయాలన్నారు. ఇందిరా క్రాంతి మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే చీరలను పరిశీలించి, వాటి ఉత్పత్తిని వేగవంతం చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ఇండెట్ల ప్రకారం వస్త్రాల మరియు మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు నిరంతరం పని కల్పించడం జరుగుతున్నదని మంత్రిగారు తెలియజేశారు. నేతన్నల సంక్షేమం కోసం తెలంగాణ చేనేత అభయహస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు, భరోసా, భద్రతా పథకాలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చేనేతజౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజారామయ్యర్ మరియు చేనేత జౌళిశాఖ అధికారులు పాల్గొన్నారు.