- విద్య సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది
- సకల భావజాల మదనమే నిజమైన యూనివర్సిటీ …
- ప్రజా ప్రభుత్వం అన్ని భావజాలాలకు ద్వారాలు తెరిచింది.. స్వేచ్ఛను కల్పించింది. నియంత్రణ, ఒత్తిడి మా ప్రభుత్వ పాలసీ కాదు
- దశాబ్ద కాలంగా ఉస్మానియా యూనివర్సిటీలో భావ స్వేచ్ఛ లేకుండా పోయింది
- నైపుణ్యం కలిగిన విద్యార్థులను అందించి, ఉపాధి కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం..
- ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చకచకా సాగుతుంది, ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం
- యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ రాష్ట్ర గతినే మారుస్తాయి
- యూనివర్సిటీ విద్యార్థుల ఎనర్జీ, ఎడ్యుకేషన్ ప్రపంచానికి దిక్సూచిగా మారాలి
విద్యారంగం సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గత 10 సంవత్సరాలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ల నియామకం లేదు, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్లు లేవు యూనివర్సిటీలు నిర్వీర్యం కాకూడదనే మా ప్రభుత్వం రాగానే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులను వైస్ ఛాన్స్లర్లుగా నియమించాం, ప్రొఫెసర్ల నియామకం ప్రారంభించామని తెలిపారు. నైపుణ్యం లేని విద్య మూలంగా భవిష్యత్తు అంధకారంగా మారుతుందని భావించిన మా ప్రభుత్వం మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీని ఫ్యూచర్ సిటీలో చకచకా నిర్మిస్తున్నాం అని తెలిపారు. రాష్ట్రంలోని 100 ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని తెలిపారు. కోటి ఉమెన్స్ కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి భవన నిర్మాణానికి 500 కోట్లు కేటాయించామని తెలిపారు.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల డైట్ చార్జీలు 40 శాతం కాస్మోటిక్ చార్జీలు రెండు వందల శాతం పెంచి బెస్ట్ డాక్టర్లతో మెనూ రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించి ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం ఇవి ఈ రాష్ట్ర గతినే మార్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ దేశానికి ప్రధాని పీవీని అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీకే దక్కింది అన్నారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ దేశాన్ని గ్లోబలైజేషన్, మోడ్రనైజేషన్ పేరుతో గట్టెక్కించారని తెలిపారు. అనేకమంది బ్యూరోక్రాట్లు, సైంటిస్టులు, రాజకీయ నాయకులను, మేధావులను ఉస్మానియా యూనివర్సిటీ అందించింది అన్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్న విద్యార్థులు ఉద్యోగాలు పొంది కుటుంబాలకు అండగా ఉండటమే కాదు… విధాన నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి తోడ్పడాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.
మాక్సిజం, మావోయిజం, గాంధీ ఇజం అన్ని భావాలు మదనం జరిగితేనే నిజమైన యూనివర్సిటీ అన్నారు. మా ప్రభుత్వం నియంత్రణ, ఒత్తిడి, అనగదొక్కడం వంటి వాటికి వ్యతిరేకం అది మా విధానం కాదు అన్నారు. ఒక ఫిలాసఫర్ చెప్పినట్టు మీ వాదనతో నేను ఏకీభవించకపోవచ్చు కానీ మీ చెప్పే హక్కును నా ప్రాణం ఉన్నంత వరకు రక్షిస్తా అన్నారు. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. యూనివర్సిటీలో జరగాల్సిన చర్చ, భావ స్వేచ్ఛ దశాబ్ద కాలంగా లేకుండా పోవడంతో ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. గత పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రత్యక్షంగా చూశాను ఏ భావం వ్యక్తం చేసిన ఎవరు ఏం చేస్తారో అన్న ఆందోళన అందరి ముఖాల్లో కనిపించేది అన్నారు. గత ఎన్నికలకు ముందు నాలుగు మాసాల పాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అనేక అంశాలు తనకు వివరించారని తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం తీసుకురావాలి, సంపద అంతా ప్రజలకు పంచాలి అంటూ పాదయాత్ర ద్వారా మాలో నమ్మకం పెరిగిందని తనతో కలిసి నడిచిన అనేకమంది మహిళలు చెప్పిన విషయాన్ని డిప్యూటీ సీఎం వివరించారు. అందుకే మేము అధికారంలోకి రాగానే మొదట అందరికీ స్వేచ్ఛ ఇచ్చామని, అన్నివాదాలు వినేందుకు ప్రభుత్వ తలుపులు బార్లా తెరిచామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఎనర్జీ, ఎడ్యుకేషన్ ప్రపంచానికి దిక్సూచిగా మారాలి అని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుంది అది కూడా ప్రపంచంతో పోటీపడే ఇంగ్లీష్ మీడియం ద్వారానే అది సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇటీవల తాము చేపట్టిన సమగ్ర ఆర్థిక ,సామాజిక, రాజకీయ, విద్య మరియు కుల సర్వేలో అభివృద్ధికి ఉత్పత్తి రంగం అయిన భూమికంటే చదువు కూడా అభివృద్ధికి అతి ముఖ్యమైన అంశమని తేలిందని తెలిపారు. యూనివర్సిటీలో ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని vc, ప్రిన్సిపాల్ కోరారు సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వీసీ కుమార్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.