- అవినీతిపై పెరుగుతున్న కేసులు
- దూకుడు పెంచిన ఏసీబీ
- రెండున్నర నెలల్లో 67 మంది అరెస్టు
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు పెంచింది. ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సగటున రోజుకు 50కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే అనిశా(ACB) అధికారులు కూడా దాడుల విషయంలో వెనుకాడటంలేదు. ఈ ఏడాది మొదట్లో సగటున 2 రోజులకు ఒక కేసు నమోదుకాగా ఆరు నెలల తర్వాత రోజుకు ఒక కేసు నమోదవుతోంది. దాంతో ఈ ఏడాది ఇప్పటికే గత సంవత్సరం మొత్తంగా నమోదైన కేసుల సంఖ్యకు దాదాపు చేరుకోవడం గమనార్హం. ఇదే దూకుడు కొనసాగితే ఏడాది చివరికల్లా అనిశా(ACB) నమోదు చేసిన కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో 300కి చేరే అవకాశాలున్నాయి.
మారని అక్రమార్కుల తీరు !
ఓవైపు అనిశా(ACB) విరుచుకుపడుతున్నా.. అవినీతిపరుల్లో అంతగా మార్పు కనిపించకపోవడం గమనార్హం. పైగా కొందరు అధికారులు లంచం డబ్బులను తమ బ్యాంకు ఖాతాలు, మొబైల్ వ్యాలెట్లలోకి వేయించుకుంటున్నట్లు సమాచారం. పట్టుబడినవారిలో ఎక్కువమంది తమ కార్యాలయాల్లో లంచం సొమ్ము తీసుకుంటూ అనిశా(ACB)కు చిక్కడం గమనార్హం. దాడుల నేపథ్యంలో కనీసం బహిరంగంగా లంచాలు తీసుకునే ధోరణిలోనైనా మార్పువస్తుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
తాత్సారం లేకుండా..
లంచం డిమాండ్ చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదుచేస్తే తక్షణమే వివరాలు ఆరాతీసి, ఆ ప్రభుత్వ ఉద్యోగిని వలపన్ని పట్టుకోవడం అనిశా(ACB) విధుల్లో ప్రధానమైంది. ప్రజలకు తక్షణ ఊరట కలిగించేవి.. లంచం డిమాండ్ చేస్తే దొరికిపోతామన్న భయాన్ని ఉద్యోగుల్లో కల్పించేవి ఈ ట్రాప్ కేసులే. గతంలో ఫలానా ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తున్నాడన్న ఫిర్యాదువస్తే తదనుగుణంగా అనిశా(ACB) అధికారులు స్పందించడంలో కొంత తాత్సారం జరిగేది. తప్పుడు ఫిర్యాదులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే అధికారులు రంగంలోకి దిగుతుంటారు. అయితే ఇలా ఆలస్యమవుతున్నకొద్దీ ఫిర్యాదుదారు నిరుత్సాహంతో వెనక్కితగ్గే అవకాశమే కాదు.. డబ్బులు డిమాండ్ చేసిన ఉద్యోగి జాగ్రత్తపడే అవకాశం ఉండేది. గత కొద్దిరోజులుగా అనిశా(ACB) అధికారులు ఈ ఆలస్యాన్ని తగ్గిస్తున్నారు. ఫిర్యాదు రాగానే స్పందిస్తున్నారు. కేసులు ఎక్కువ నమోదవడానికి ఇదే ప్రధాన కారణం.
2024లో అనిశా(ACB) మొత్తం 152 కేసులు నమోదు చేసి 223 మందిని అరెస్టుచేయగా ఈ ఏడాది ఇప్పటికే (జులై 18 వరకు) 140 కేసులు నమోదుకాగా 142 మందిని అరెస్టు చేశారు. ప్రధానంగా మే, జూన్, జులైల్లోనే (రెండున్నర నెలల్లో) 67 మంది అరెస్టయ్యారు.
గతంలో రోజుకు 10 ఫిర్యాదులు కూడా వచ్చేవి కావని, ఇప్పుడు ఒక్కోసారి ఇవి రోజుకు 50 మించుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు. ఇవి వ్యక్తిగతంగా లేదా ఫోన్ లో ఫిర్యాదుచేసేవారికి సంబంధించినవేనని.. సామాజిక మాధ్యమాలద్వారా వస్తున్న ఫిర్యాదులు వీటికి అదనమని వివరించారు. ఇచ్చిన ఫిర్యాదుకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పెరుగుతుండటం వల్లే ప్రజలు ముందుకొస్తున్నారని తెలిపారు.
ఈ ఏడాదిలో నమోదైన అనిశా కేసుల వివరాలు ఇలా..
జనవరి : 19 17
ఫిబ్రవరి : 17 23
మార్చి : 15 15
ఏప్రిల్ : 21 20
మే : 19 25
జూన్ : 31 25
జులై (18వరకు) : 18 17
మొత్తం కేసులు : 140, మొత్తం అరెస్టులు : 142(సోర్స్:ఈనాడు)