జీఎస్టీ ఎగ‌వేత‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాలి: ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

వ‌స్తు, సేవ‌ల ప‌న్నుకు (జీఎస్టీ) సంబంధించి ఎగ‌వేత‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. వాణిజ్య ప‌న్నుల శాఖ‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. జీఎస్టీ ప‌రిధిలోని సంస్థ‌లు స‌క్ర‌మంగా పన్ను చెల్లించేలా చూడాల‌ని సీఎం సూచించారు. అదే స‌మ‌యంలో చెల్లింపుదారుల‌కు సంబంధించి అనుమానాలు, సందేహాల నివృత్తికి కాల్‌సెంట‌ర్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ఈ సెంట‌ర్ నిర్వ‌హ‌ణ‌లో ఏఐను వినియోగించుకోవాల‌ని సీఎం సూచించారు. జీఎస్టీ, ఇత‌ర ప‌న్నుల విష‌యంలో పొరుగు రాష్ట్రాలు అవ‌లంభిస్తున్న విధానాల‌ను అధ్య‌యనం చేసి మేలైన విధానాల‌ను స్వీక‌రించాల‌న్నారు. ప‌న్ను చెల్లింపుదారుల‌కు మెరుగైన సేవ‌లు అందించేలా కార్యాల‌యాల్లో ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, వాణిజ్య ప‌న్నుల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ స‌య్య‌ద్ అలీ ముర్తుజా రిజ్వీ, వాణిజ్య ప‌న్నుల శాఖ డైరెక్ట‌ర్ హ‌రిత త‌దిత‌రులు పాల్గొన్నారు.