- కర్ణాటకలో ఓ గుమాస్తా అక్రమార్జన
- సోదాల్లో బయటపడ్డ మాజీ క్లర్క్ బాగోతం
కర్ణాటక (Karnataka)లో భారీ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలో కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో క్లర్క్‌గా పనిచేసిన వ్యక్తిపై లోకాయుక్త దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
లోకాయుక్త అధికారుల ప్రకారం.. కలకప్ప నిడగుండి కొప్పల్ జిల్లాలోని కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో గుమాస్తాగా (Ex Clerk) పనిచేశారు. ఆ సమయంలో రూ.15 వేల జీతం తీసుకునే అతడు.. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ కేఆర్ఐడీఎల్ ఇంజినీర్ చిన్చోల్కర్‌తో కలిసి నిడగుండి నకిలీ పత్రాలు, బిల్లులు సృష్టించి రూ.75 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో లోకాయుక్తా దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో దాదాపు రూ.30 కోట్లకు పైగా విలువైన ఆస్తులు బయటపడ్డాయి. దాదాపు 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులు నిడగుండి, ఆతని భార్య, సోదరుడి పేర్లతో ఉన్నట్లు తేలింది. అంతేకాదు, ఆయన నివాసం నుంచి 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి ఆభరణాలు, నాలుగు వాహనాలను (రెండు కార్లు, రెండు బైక్‌లు) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిడగుండిని అదుపులోకి తీసుకున్న లోకాయుక్త అధికారులు విచారణ చేస్తున్నారు.