- 4వేల మెగావాట్ల విద్యుత్ అవసరాలు తీర్చే మంచి కార్యక్రమం,
- ఇప్పటికి 16 వందల మెగావాట్లు జాతికి అంకితం చేశాం
- గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనుల్లో రెండేళ్ల జాప్యం
- పవర్ ప్లాంట్ ప్రాంత ప్రజలకు ఉచితంగా విద్య, వైద్య సదుపాయం కల్పిస్తాం
- ఆగస్టు 15లోగా యాదాద్రి, పులిచింతల భూ నిర్వాసితులకు ఉద్యోగాలు, R&R ప్యాకేజీ
వచ్చే సంవత్సరం జనవరిలో 4వేల మెగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్ ను పూర్తిగా జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మొదటి యూనిట్ జాతికి అంకితం చేసి విద్యుత్ అవసరాలు తీర్చడం ఒక చారిత్రాత్మక కార్యక్రమం అన్నారు.
గత ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సాధించడంలో జాప్యం చేయడం మూలంగా సుమారు రెండు సంవత్సరాల పాటు ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని ఫలితంగా ఆర్థిక భారం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఇందిరా ప్రభుత్వం రాగానే కేవలం రెండు నెలల వ్యవధిలో పర్యావరణ అనుమతులు సాధించామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కోసం ప్రతి నెల, వారం వారీగా టార్గెట్లు పెట్టుకొని ఇప్పటికే అనుకున్న లక్ష్యం మేరకు 1600 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన రెండు యూనిట్లు జాతికి అంకితం చేసినట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి స్థానిక మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ఇది సాధ్యమైందని అన్నారు. కిందిస్థాయి సిబ్బంది మొదలుకొని సీఈ స్థాయి అధికారి వరకు మనసు పెట్టి పని చేయడంతో అనుకున్న లక్ష్యం మేరకు యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు పూర్తవుతున్నాయి అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ దూరంగా ఉంది, అక్కడ ఏం పని చేస్తామని భావనను ఉద్యోగులు దూరంగా పెట్టాలని వారికి అత్యుత్తమ సౌకర్యాలు స్థానికంగా కల్పిస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు నిర్మిస్తామని, కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారీ విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు సహకరించిన స్థానిక ప్రజలకు థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులకు అందే విద్య, వైద్య సౌకర్యాలను ఉచితంగా అందచేస్తామని ప్రకటించారు. స్థానిక నియోజకవర్గ ప్రజలకు అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు. స్థానికంగా విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు మూలంగా తమకు మంచి జరిగిందని ఆనందంలో ప్రజలు ఉండేలా సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలతో రహదారులు దెబ్బతింటున్నాయని స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు పెద్ద సంఖ్యలో సిసి రోడ్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని డిప్యూటీ సిఎం తెలిపారు. పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములను త్యాగం చేసిన వారికి ఆగస్టు 15లోగా ఉద్యోగాలు ఇస్తామని, R×R ప్యాకేజీ పూర్తిగా అందరివారికి అందచేస్తామని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తో పాటు పులిచింతల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నిబంధనల మేరకు ఉద్యోగాలు కల్పిస్తామని డిప్యూటీ. సిఎం భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అన్నారు.
డిప్యూటీ సీఎం డైనమిజంతో ఫ్యాక్టరీ పనులు వేగంగా సాగుతున్నాయి: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క డైనమిక్ గా వ్యవహరించి, సమర్థవంతంగా పర్యవేక్షించడంతో ఆగిపోయిన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు చివరి దశకు చేరిందని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆగిపోయిన ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సాధించడం, ప్రతి వారం టార్గెట్ పెట్టి ప్రగతిని సమీక్షించడం మూలంగా రెండు సంవత్సరాల వ్యవధిలోనే 4వేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. డిప్యూటీ సీఎం కృషికి నల్గొండ జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
