- 145 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్
- ఒక్క జులైలోనే 22 కేసులు, 20మంది అరెస్ట్
- 7 నెలలు.. 148 కేసులు.. అవినీతి అధికారులపై కఠిన చర్యలు
- ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో టోల్ ఫ్రీ నెంబర్ స్టిక్కర్లు
- లంచం ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యం
- లంచం అడిగితే డయల్ 1064..
- విస్తృత ప్రచారం చేస్తున్న ఏసీబీ అధికారులు
అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064పై ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో టోల్ ఫ్రీ నెంబర్ పై ప్రచారం చేసేందుకు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించిన స్టిక్కర్ల ను అంటించారు. శనివారం నుంచి పట్టణ ప్రాంతాల్లో ఈ స్టిక్కర్లను అంటిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ స్టిక్కర్ పై ప్రభుత్వ కార్యాలయాల్లో మిమ్మల్ని ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, వేధించినా వెంటనే డయల్ 1064 అంటూ ఏసీబీ అధికారులు ముద్రించారు. ఈ నెంబర్ కు ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఏసీబీ అధికారులు భరోసా ఇస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల నమోదులో రికార్డు సృష్టిస్తున్నది. అయినా ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదనే చర్చ జరుగుతున్నది. తోటి ఆఫీసర్లే పట్టుబడుతున్నా… లంచాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదని టాక్. ఇందులో పోలీసు, జీహెచ్ఎంసీ ఇతర శాఖల అధికారులు కూడా ఉండడం గమనార్హం.
ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు ఏసీబీ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. 148 కేసులు నమోదు చేయగా, ఇందులో 93 ట్రాప్. 9 అక్రమ ఆస్తులు, 15 క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు, 11 సాధారణ, 17 ఆకస్మిక, మూడు ఇంటెలిజెన్స్ తనిఖీలు ఉన్నాయి. కాగా, ఈ దాడుల్లో 145 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసి, రూ.30.32 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. రూ.39.16 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. వందల కోట్లు ఉంటుందని అంచనా. కాగా, ఏసీబీ చేపట్టిన దాడుల్లో నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ మరళీధర్ రావు, ఈఈ నూనె శ్రీధర్ తోపాటు, ఈఎన్సీ హరిరామ్ లాంటి ఉన్నతాధికారులను కూడా అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు అధికారుల వద్దే దాదాపు రూ.వెయ్యి కోట్లకు పైగా అవినీతి నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
నెల రోజుల్లోనే 22 కేసులు
ఈ ఏడాది జులైలోనే ఏసీబీ అధికారులు మొత్తం 22 కేసులు నమోదు చేశారు. ఇందులో 13 ట్రాప్. ఒక అక్రమ ఆదాయం, ఒక క్రిమినల్ మిస్ కండక్ట్, ఇతర కేసులు ఉన్నాయి. కాగా, ఈ కేసుల్లో 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్ కాగా, ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా అరెస్ట్ అయ్యారు. వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ట్రాప్ కేసుల్లో రూ.5.75 లక్షలు స్వాధీనం చేసుకోగా, ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో రూ.11.5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించారు. ఆర్టీఏ, చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రత్యేక తనిఖీలు చేశారు. ఆ సమయంలో లెక్కల్లోకి రాని రూ.1.49 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
జులైలో పట్టుబడిన అధికారులు ఇలా..
* పెద్దపల్లి జిల్లా పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ సీసీ రోడ్లకు ఎంబీ బుక్ నోట్ చేసేందుకు రూ. రూ.90 వేలు లంచం తీసుకుంటూ జులై 12న ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాడెండ్ గా పట్టుబడ్డారు.
* ఓ ఉద్యోగి ట్రాన్స్ ఫర్ కోసం పంచాయతీరాజ్ ఈఎన్సీ కనకరత్నం రూ. 50 వేలు లంచం తీసుకుంటూ జులై 16న పట్టుబడ్డారు.
* యాక్సిడెంట్ డెత్ క్లెయిమ్ కోసం రూ. 50వేలు లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా పరిధిలోని సిర్పూర్ కాగజ్ నగర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాం మోహన్ జులై 18న అరెస్ట్ అయ్యారు.
* ఓ హోటల్ ను సీజ్ చేస్తానని బెదిరించి యజమాని నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ.. జీహెచ్ఎంసీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ జులై 25న ఏసీబీకి చిక్కారు.
పరారీలోనే పంచాయతీ సెక్రెటరీ
ఏసీబీ అధికారులకు చిక్కినట్టే చిక్కిన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల ఇన్ముల్నర్వ పంచాయతీ సెక్రెటరీ సురేందర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. బాధితుడి నుంచి రూ. లక్ష లంచం డిమాండ్ చేసిన ఆయన ముందుగా రూ.50వేలు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. అయితే బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ట్రాప్ చేయగా.. అధికారులు పట్టుకునే లోపే పంచాయతీ సెక్రెటరీ కారులో పరా రయ్యాడు. జులై 25న ఈ ఘటన జరగ్గా.. ఆ సెక్రెటరీ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.