నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని సమాజానికి అందించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారంనాడు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో గిరిజన జర్నలిస్టులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు వృత్తితోపాటు తమని తాము తీర్చిదిద్దుకుంటూ జర్నలిజంపట్ల ఆసక్తి కనబరిచేలా వార్తలు రాయాలన్నారు. అందులోభాగంగానే గిరిజన జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా విడతల వారీగా ఈ జర్నలిస్టుల శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
సమాచార శాఖ అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్ మాట్లాడుతూ, గిరిజన జర్నలిస్టులకు మీడియా అకాడమి శిక్షణా తరగతులు నిర్వహించడం గర్వించదగ్గ విషయం అన్నారు. నేను కూడా గిరిజన బిడ్డనే కాబట్టి ఈ విధంగా మిమ్మలను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా శిక్షణలో పాల్గొంటున్న గిరిజన విలేకరులు మన గిరిజన జాతి ఔన్నత్యాన్ని చాటేలా కృషి చేయాలని కోరారు. శిక్షణా తరగతులలో ప్రముఖ సంపాదకులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్తు – మీడియా ధోరణులు, ఆధునిక యుగంలో మీడియాలో వస్తున్న మార్పుల గురించి వివరించారు. సోషల్ మీడియా యూట్యూబ్ లో వస్తున్న వార్తల గురించి వివరించారు.
దిశ ఎడిటర్ మార్కండేయ వార్తా కథనాలు – ప్రత్యేక కథనాలు ఎలా రాయాలో తెలియజేశారు. గిరిజన జర్నలిస్టులు అడవి బిడ్డలు కాబట్టి వారు ప్రత్యేక వ్యాసాలు రాయాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ గోవింద్ రెడ్డి నేర వార్తల సేకరణ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, చట్టాలపై అవగాహన ఉండాలని, వార్తలు సేకరించే ముందు నిజనిర్ధారణ చేసుకొని చేసుకుని వ్రాయాలని ఆయన సూచించారు, అలాగే నేర వార్తలు లలో చేయాల్సినవి చేయకూడనివి అంశాలపై క్లుప్తంగా వివరించారు. సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి సమాచార హక్కు చట్టం- 2005 గురించి సమగ్రంగా వివరించి జర్నలిస్టుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర రావు, గిరిజన జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
