- పరుగు పోటీల్లో స్వర్ణపతకాలు సాధించిన ఇద్దరు విద్యార్థులు
- అభినందించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శి, ఎంజెపి కార్యదర్శి
బీసీ గురుకుల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించారు. ఈనెల 3, 4 తేదీల్లో హన్మకొండ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీల్లో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు స్వర్ణ పతకాలను సాధించారు. 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో వరుసగా రెండు స్వర్ణ పతకాలను కే. శివకుమార్ సాధించాడు. మహబూబ్ నగర్ జిల్లా లోని కోయిల్ కొండ బీసీ గురుకుల కాలేజీలో శివకుమార్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. 600 మీటర్ల పరుగు పోటీల్లో స్వర్ణ పతకం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న భరత్ సాధించాడు. యాదగిరి భువనగిరి జిల్లా లోని పోచంపల్లి లో బీసీ గురుకుల కాలేజీ లో భరత్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. స్వర్ణ పతకాలను గెలుచుకున్న విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సెక్రటరీ శ్రీధర్, ఎంజెపి సెక్రటరీ బడుగు సైదులు, జాయింట్ సెక్రటరీ తిరుపతి అభినందించారు.
తెలంగాణ విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా శిక్షణ ఇస్తున్న ప్రభుత్వం స్టేట్ స్పోర్ట్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చిందని, రానున్న రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో తెలంగాణ విద్యార్థులు పతకాలు సాధించాలని ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు ఆకాంక్షించారు. ఇటీవల సెయిలింగ్ పోటీల్లోనూ బీసీ గురుకుల విద్యార్థులు పతకాలు సాధించారని ఆయన గుర్తుచేశారు. విద్యార్థుల ఆసక్తి మేరకు వారికి క్రీడల్లో శిక్షణ ఇస్తున్నామని, ప్రభుత్వం అనేక పోటీల్లో విద్యార్థులు అనేక పోటీల్లో పాల్గొన్నడానికి అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం, ఆర్ఠిక సహకారం ప్రభుత్వం అందిస్తున్నదని ఆయన తెలిపారు.