రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానాల అమలు తీరుపై ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో, రాష్ట్రంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో వివిధ సంస్కరణల అమలు స్థితిని ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈ సంస్కరణలను అమలు చేయడంలో తెలంగాణ నిరంతరం అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, నియంత్రణ ప్రక్రియలను సరళీకృతం చేయడం ద్వారా మరింత మెరుగుదలకు గణనీయమైన అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఈ ప్రయత్నాలు చాలా కీలకమని ఆయన అన్నారు.
సంస్కరణల ఎజెండాను విజయవంతంగా అమలు చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి తెలిపారు. వివిధ సంస్కరణల అమలుపై కేంద్ర ప్రభుత్వం సూచించిన గడువును ఖచ్చితంగా పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారిణి, టాస్క్ ఫోర్స్ సభ్యురాలు శ్రీమతి సుకృతి లిఖి సులభతర వాణిజ్య విధానంలో భాగంగా అమలు జరుగుతున్న సంస్కరణలలో రాష్ట్ర పనితీరును ప్రశంసించారు, సంస్కరణల అమలు చేయడంలో తెలంగాణ చాలా బాగా పనిచేస్తోందని అన్నారు. అయితే, రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి, దాని పెట్టుబడి ఆకర్షణను పెంచడానికి మరింత కృషి చేయవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రాలు వ్యాపార సంస్కరణల అమలును కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలియజేశారు. కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు సమావేశానికి హాజరై, వారి వారి శాఖలు అమలు చేస్తున్న సంస్కరణలు గురించి సమావేశంలో వివరించారు.
ఈ సమావేశంలో రవాణా, రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, ఐటీఈ&సీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, కార్మిక, ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టి.కె.శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
