- ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవాలి
- ఎన్‌జీటీ, సీపీసీబీ ఆదేశాలు
- కేంద్రం ఆదేశాలు పట్టని తెలంగాణ పీసీబీ
కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ల్యాబొరేటరీలు, సైంటిస్టుల సంఖ్యను పెంచుకోవాలని, ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) ఇటీవల రాష్ట్రాలను ఆదేశించాయి. కానీ, ఈ ఆదేశాలను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలోని కొందరు ఉన్నతాధికారులు, ఇంజనీర్లు కాలపరిమితి (పూర్తి అదనపు బాధ్యత)తో నియమితులవుతున్న మెంబర్ సెక్రటరీలను తప్పుదోవ పట్టిస్తూ పీసీబీ విస్తరణ, బలోపేతానికి ఎలాంటి శాస్త్రీయ కమిటీని ఏర్పాటు చేయకుండా ఎన్‌జీటీ, సీపీసీబీ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల విస్తరణ, బలోపేతం కోసం 42 పోస్టులను ప్రతిపాదించింది. వీటిలో భౌతిక తనిఖీలకు పెద్దపీట వేసి ఒక్క ఇంజనీరింగ్ విభాగానికే 26 పోస్టులను, పరిశ్రమల్లో శాస్త్రీయ తనిఖీల కోసం సైంటిఫిక్ విభాగానికి తూ.. తూ.. మంత్రంగా కేవలం 9 పోస్టులను మాత్రమే కేటాయించారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో సైంటిఫిక్ అధికారులను ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు చాలా చిన్నచూపు చూస్తూ.. వారి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తూ.. అన్ని రకాలుగా అణిచివేస్తున్నారని TGPCB సైంటిఫిక్ విభాగం అధికారులు వాపోతున్నారు.
ఇందుకు సంబంధించిన ఫైల్‌పై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖని కలిసి పీసీబీ ఉన్నతాధికారులు, ఇంజినీర్లే గత వారం స్వయంగా సంతకం చేయించుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఈ విషయం బయటికి పొక్కడంతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అభ్యంతరం చెప్పినట్టు పీసీబీలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో పూర్తి సిబ్బందిని నియమించాలని పలువురు పర్యావరణవేత్తలు కోరుతున్నారు.