భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలి: ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు

జీహెచ్ ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సి.ఎస్. నేడు సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాధ్, జల మండలి ఎండి అశోక్ రెడ్డి, విద్యుత్ విభాగం సి.ఎం.డి ముష్రాఫ్ అలీ, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక మూడు పోలీస్ కమిషనరేట్ల కమీషనర్లు, హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, నేడు సాయంత్రం నుండి ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండి ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో 12 సె.మి. వరకు వర్ష పాతం రికార్డ్ అయిందని తెలియజేశారు. వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, నీటి నిలిచే ప్రాంతాల (వాటర్ లాగింగ్ పాయింట్స్)పై ప్రత్యేక దృష్టి సారించాలని సి.ఎస్ ఆదేశించారు. ముఖ్యంగా వాటర్ లాగింగ్ రిపోర్ట్ అవుతున్న ఐటీ కారిడార్, టివీ-9, టైమ్స్ ఆఫ్ ఇండియా, రాజ్ భవన్, షేక్ పేట్ ఏరియాలలో నీటి నిలువ సమస్య వస్తున్నందున తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు డ్రైనేజ్ నాలాలు మూతలు ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వర్షం పడే సమయంలో విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని తెలిపారు.

క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని సూచించారు. హైడ్రా (HYDRAA)తో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అందరు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది వేగంగా స్పందిస్తున్నారని తమంతా అప్రమత్తంగా ఉన్నామని అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి తెలియజేశారు. 250 టీంలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నట్లు తెలియజేశారు. NDRF/ SDRF/HYDRAA,GHMC టీంలు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. జిహెచ్.యం.సి, కలెక్టర్ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు. ఈరోజు రాత్రి హిమాయత్ సాగర్ కు చెందిన ఒక గెట్ ను ఓపెన్ చేసి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. దాదాపు 250 విద్యుత్ కు సంబంధించిన సమస్యలు రిపోర్ట్ అయినాయని అందులో 149 సమస్యలు వెంటనే పరిష్కరించామని, మిగతా ఫిర్యాదులు ఇంకో 30 నిమిషాలలో పూర్తివుతాయని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం సూచనలను పాటించి సహకరించాలని కోరారు.

ఈ వర్షాల నేపధ్యలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లుఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ ఎంసీ పరిధిలో బల్దియాకు చెందిన దాదాపు 150 బృందాలు క్షత్ర స్థాయిలో ఉంది నీటి నిల్వలను తొలగించడం, లోతట్టు ప్రాంతాలలో ముంపుకు గురికాకుండా చూడడం తదితర చర్యలను చేపడుతున్నారని వెల్లడించారు. అదేవిధంగా హైద్రాకు చెందిన 201 మాన్సూన్ బృందాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ప్రధానంగా వర్షపు నీటితోఉన్న ప్రధాన రహదారులలో నీటిని తొలగించి రవాణా సాఫీగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
నగరంలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న విధ్యుత్ ట్రాన్సఫారాలు, విధ్యుత్ లైన్లనుయుద్ధ ప్రాతిపదికగా పునరుద్దరించాలని ఎస్.పి.డి.సి.ఎల్ సి.ఎం.డి ని ఆదేశించారు. అగ్ని మాపక, విపత్తు నిర్వహణ శాఖ కు చెందిన బృందాలన్నీ తగు ఎక్విప్మెంట్ తో సిద్ధంగా ఉన్నాయని వివరించారు. నగర్ ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగ కుండా అన్ని ముందస్తు జాగ్రత తీసుకుంటున్నామని సి.ఎస్ తెలిపారు. వర్షాలు, వరదల వల్ల ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ ఎంసీ, హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్ ల కంట్రోల్ రూంలకు , హైడ్రా కంట్రోల్ రూమ్ లతోపాటు దయాల్ 100 ,116 లకు ఫోన్ చేయాలని సి.ఎస్ సూచించారు.