గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా తెలంగాణ: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

  • ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి
  • రాష్ట్రంలో “తోషిబా” రూ.347 కోట్ల పెట్టుబడి
  • రూ.177 కోట్లతో ఈహెచ్ వీ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ
  • రూ.65 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీ ఆర్ జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్
  • రూ.105 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టేర్ యూనిట్
  • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మార్చేందుకు మా ప్రభుత్వం
ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రుద్రారం లోని తోషిబా ట్రాన్స్ మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో రూ.347 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈహెచ్ వీ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీఆర్జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, సర్జ్ అరెస్టేర్ యూనిట్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. “ఆనతి కాలంలోనే తెలంగాణ తయారీ రంగంలో దేశానికి దిక్సూచిగా మారింది. 2024 -25 లో ఇండస్ట్రియల్ అవుట్ పుట్ రూ.2.77 లక్షల కోట్లు. ఇందులో 48 శాతం వాటా తయారీ రంగానిదే. 9 నెలల్లోనే రూ.లక్ష కోట్ల విలువైన మార్చండైజ్ ఎక్స్ పోర్ట్స్ రాష్ట్రం నుంచి జరిగాయి. జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతం. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ” అని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

  • 2040 నాటికి దేశీయ విద్యుత్ డిమాండ్ రెట్టింపు…
    “2040 నాటికి దేశీయ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని ఆర్థిక సర్వే(2024 – 25) లెక్క తేల్చింది. ఈ డిమాండ్ ను అందిపుచ్చుకొని రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. తెలంగాణ ను రెన్యువబుల్స్ ఇంజిన్ ఆఫ్ ఇండియా గా మార్చాలనే సంకల్పంతో క్లీన్ & గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2025 ను తీసుకొచ్చాం. ఇప్పటికే క్లీన్ ఎనర్జీలో రూ.29వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగాం. 2030 నాటికి న్యూ రెన్యువబుల్ కెపాసిటీని 20వేల మెగా వాట్లకు పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం” అని చెప్పారు.
  • ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ ఎక్విప్ మెంట్ జోన్లు…
    “బ్యాటరీలు, పవర్ కాంపోనెంట్స్, స్మార్ట్ గ్రిడ్స్ తదితర రంగాల్లో తోషిబా లాంటి దిగ్గజ సంస్థలను తెలంగాణాకు ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ ఎక్విప్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయబోతున్నాం. స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం తోషిబా – తెలంగాణ ఆర్ అండ్ డీ హబ్ కు శ్రీకారం చుట్టబోతున్నాం. క్లీన్ టెక్, సెమీ కండక్టర్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ మాన్యుఫాక్చరింగ్ లో పెట్టుబడులకు తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వేదిక ద్వారా జపాన్ కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నా” అని అన్నారు.
  • దుష్ప్రచారానికి ధీటైన సమాధానం తోషిబా…
    “కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో నే అంతర్జాతీయ, జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. కానీ.. కొందరు కావాలని పని గట్టుకొని వాటిని ఉత్తుత్తి ఎంవోయూ లు అంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విమర్శలకు ఈరోజు మేం కాదు, తోషిబా కంపెనీనే మీకు ధీటైన సమాధానం ఇస్తుంది. ఈ ఏప్రిలో లో జపాన్ పర్యటనలో రూ. 562 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తోషిబా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో ఈరోజు రూ.177 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఈహెచ్ వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించుకున్నాం. రూ.65 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీ ఆర్ జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, రూ.105 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టేర్ ను ప్రారంభించుకున్నాం. ఈ పెట్టుబడులతో ఎనర్జీ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకట స్వామి, ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, జపాన్ ఎంబసీ ఎకనామిక్ & డెవలప్మెంట్ మంత్రి Kyoko Hokugo, తోషిబా కార్పొరేషన్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ Hiroshi Kaneta, సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.