డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట పేద‌ల‌ను దోచుకున్న బిఆర్ఎస్ ప్ర‌భుత్వం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • 592 మంది అక్క‌చెల్లెళ్ల‌కు ఈ ఇండ్లు రాఖీ కానుక‌
  • ప‌ట్ట‌ణ పేద‌ల‌కు ద‌శ‌ల‌వారీగా ఇందిర‌మ్మ ఇండ్లు
  • కేసీఆర్ కుటుంబం కాసుల క‌క్కుర్తి వ‌ల్లే కాళేశ్వ‌రం కూలింది
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

పేద‌ల‌కు ఆరేళ్ల‌కు పైగా డ‌బుల్ బెడ్ ఇండ్ల ఆశ‌లు చూపి గ‌త బి ఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద అక్ర‌మ వ‌సూళ్లు చేసి పేద‌ల‌ను దోచుకుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఆరోపించారు. రెండు ఎన్నిక‌ల్లో ఇవే ఇండ్ల‌ను చూపిస్తూ ఎవ‌రికీ ఇవ్వ‌లేద‌ని, మూడోసారి కూడా మోసం చేయ‌డానికి గ‌త ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తే ప్ర‌జ‌లు త‌గు రీతిలో బుద్ది చెప్పార‌ని ఆయ‌న అన్నారు. వ‌రంగ‌ల్ జిల్లా హ‌నుమ‌కొండ బాల స‌ముద్రం ప్రాంతంలో శుక్ర‌వారం నాడు 592 మంది ల‌బ్దిదారుల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను అంద‌జేసి మంత్రి పొంగులేటి ద‌గ్గ‌రుండి మ‌రీ గృహ ప్ర‌వేశాలు చేయించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేంద్రర్ రెడ్డి, నాగారాజు, మేయ‌ర్ గుండు సుధారాణి త‌దిత‌రుల స‌మ‌క్షంలో అత్యంత ఆనందోత్సాహాల న‌డుమ జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి మాట్లాడారు.

పార్టీల‌కు అతీతంగా ఎంతో పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక జ‌రిగిందని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వంలో కేవ‌లం ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు , కొంత‌మంది ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మాత్ర‌మే ఇండ్లు మంజూర‌య్యాయ‌ని ఆరోపించారు. గ‌తంలో క‌ట్టిన ఈ ఇండ్ల‌ను ఎంద‌రో పేద‌ల‌కు చూపించి అడ్డ‌గోలుగా బి ఆర్ ఎస్ నేత‌లు వ‌సూళ్లు చేసి ఎవ‌రికీ ఒక్క ఇంటిని ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. అంతేగాక ఈ ఇండ్ల ఆశ‌ను చూపి ప్ర‌తిసారి ఎన్నిక‌ల్లో ల‌బ్దిపొందార‌ని అయితే మూడో సారి వారి మోసాన్ని గ‌మ‌నించి పేద‌లు త‌గు బుద్ది చెప్పార‌ని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కే గాక ప‌ట్ట‌ణ పేద‌ల‌కు గృహ వ‌స‌తి క‌ల్పించేందుకు ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఈ శ్రావ‌ణ మాస శుక్ర‌వారం నాడు 592 మంది గృహ ప్ర‌వేశాలు చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.ఈ ఇండ్లు మ‌హిళ‌ల పేరిటే మంజూరు చేశామ‌ని, ఒక రోజు ముందుగాను 592 మంది అక్క‌చెల్లెళ్ల‌కు రాఖీ పౌర్ణ‌మి కానుక అందిన‌ట్ల‌యింద‌ని మంత్రి అన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్ష‌పాతిగా సంక్షేమం – అభివృద్ది ప్రాతిప‌దిక‌న ముందుకు సాగుతోంద‌న్నారు. తాజాగా ఆరు ల‌క్ష‌లకు పైగా రేష‌న్ కార్డులు మంజూరు చేయ‌డం , ఇప్ప‌టికే ద‌శ‌ల వారీగా ఆరు హామీల‌ను అమ‌లు చేస్తున్న విష‌యం గ‌మ‌నించాల‌ని మంత్రి గారు కోరారు. క‌మీష‌న్ల కోసం కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడిచేలా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో బి.ఆర్.ఎస్ ప్ర‌భుత్వం క‌మీష‌న్ల క‌క్కుర్తికి పాల్ప‌డింద‌ని మంత్రి పొంగులేటి ఆరోపించారు. వారి అవినీతి వ‌ల్లే కాళేశ్వ‌రం కూలింద‌న్నారు. వేల కోట్ల రూపాయిలు కేసీఆర్ కుటుంబానికి చేరాయ‌న్నారు. దోచుకున్న‌ది దాచుకోవ‌డానికే బి ఆర్ ఎస్ నాయ‌కులు తిరిగి అధికార ప్ర‌భుత్వంపై దాడికి దిగుతున్నార‌ని విమ‌ర్శించారు. కాగా దేశంలో బిసీ కుల‌గ‌ణ‌న చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మేన‌ని, 42 శాతం బీసీ కోటా అమ‌లు చేస్తామ‌ని తెలిపారు.