ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో పేలిన బాయిలర్ స్టీమ్.. కార్మికుడు మృతి

యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద ఉన్న ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఓ కార్మికుడు మృతిచెందారు. మంగళవారం ఉదయం ఎక్స్‌ప్లోజివ్‌ ప్లాంట్‌ బయట బాయిలర్‌ స్టీమ్‌ పైపు తెరుస్తుండగా ఒక్కసారి పేలుడు సంభవించి సదానందం(50) అనే కార్మికుడు అక్కడికక్కడే మరణించారు.

ప్రతీ రోజు మాదిరిగానే ఉదయం 7.30 గంటల సమయంలో బాయిలర్ స్టీమ్‌ను మరో ప్లాంటుకు మళ్లించే క్రమంలో స్టీమ్‌కు సంబంధించిన మూతను విప్పుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ వీధుల్లో ఉన్న సదానందం అనే కార్మికుడు తలకు తీవ్రంగా గాయం కావడం అక్కడికక్కడే మృతి చెందాడని వెల్లడించారు. మృతుని స్వస్థలం గోదావరిఖని అని చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నారని, ఆలేరు పట్టణంలో నివాసం ఉంటున్నారని తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా హాస్పిటల్‌కి తరలించామన్నారు.