గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి జరగాలంటే క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ రోజు మక్తల్ నియోజకవర్గం మక్తల్, ఆత్మకూరు, నార్వ,
ఉట్కూరు మండల కేంద్రాల్లో మరియు అమరచింత, వనపర్తి జిల్లా కేంద్రాల్లో క్రీడా మైదానాలు మౌలిక సదుపాయాల ఏర్పాటు కై అధికారులతో ఆయన ఆయా ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధి చెందాలంటే మండలా నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండాలని ఆ ఆలోచన తోటే ఇప్పటివరకు మౌలిక సదుపాయాలేని మండల కేంద్రాల పైన దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అంచలంచలుగా అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు అయ్యే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
క్రీడల అభివృద్ధికి నూతన క్రీడా విధానం ప్రకటించుకొని దాని పటిష్టంగా అమలు చేయడానికి జరుగుతున్న కృషిలో భాగంగానే క్రీడా మైదానాల నిర్మాణము మౌలిక సదుపాయాల పై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఒక దశాబ్ద కాలం నుండి ఎంతో వెనకబాటుకు గురైన మక్తల్ నియోజకవర్గంలో సమర్థవంతమైన క్రీడాకారులు ఉన్నారని వారిని గుర్తించి ప్రోత్సహించడానికి కృషి చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో గ్రామీణ క్రీడా రంగ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ స్పష్టమైన కార్యాచరణకు పూనుకోవడం హర్షనీయమని అన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
అన్ని రాష్ట్రాల్లో కన్నా ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ క్రీడాల దినోత్సవం అని పురస్కరించుకొని స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీన ఎల్ బి టెన్నిస్ కాంప్లెక్స్ లో సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ పర్యటనలో మంత్రి వాకిటి శ్రీహరి వెంట స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనీ బాలాదేవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి స్థానిక ప్రజా ప్రతినిధులు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు చంద్రారెడ్డి, రవీందర్, భాష, అశోక్ కుమార్ మధు తదితరులు పాల్గొన్నారు.