కొడంగల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొడంగల్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం , దౌల్తాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గిలోని శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాలను సమూలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో కొడంగల్ లోని చారిత్రక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలను ఆమోదించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. ప్రాకార మండపం, మాడ వీధులు, భూ వరాహ స్వామి దేవాలయం, గర్భగుడి, మహా మండపం డిజైన్లను అధికారులు సీఎంకు చూపించారు. దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. అలాగే డిజైన్లపై అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. రాతి కట్టడాలతో ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాస రాజు, కార్యదర్శి మాణిక్ రాజ్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
