రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సింగ‌పూర్ వంటి దేశాల్లో 30 ఎక‌రాల్లోనే నైట్ స‌ఫారీలు ఉన్నాయ‌ని, మ‌నకు భారీ విస్తీర్ణాల్లో అట‌వీ ప్రాంతాలు.. అందులోనే న‌దులు, జ‌ల‌పాతాలు ఉన్నందున ఆ వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసే ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సూచించారు.

🪴 అట‌వీ శాఖ‌పై క‌మాండ్ కంట్రోల్‌ సెంట‌ర్‌ (ICCC) లో మంత్రి కొండా సురేఖతో కలిసి ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించి పలు ఆదేశాలు జారీ చేశారు.

🪴మ్రాబాద్‌, క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టులున్నా తెలంగాణ వాసులు ఇత‌ర రాష్ట్రాల్లోని బందీపూర్‌, త‌డోబా వంటి ప్రాంతాల‌కు పులుల సంద‌ర్శ‌న‌కు వెళుతున్నారు. అమ్రాబాద్, క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టుల‌కు సంద‌ర్శ‌కుల సంఖ్య పెంచేలా సౌక‌ర్యాలు క‌ల్పించాలి.

🪴 అట‌వీ, రెవెన్యూ శాఖ‌ల మ‌ధ్య భూ వివాదాల ప‌రిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సంయుక్త స‌ర్వే చేప‌ట్టాలి. వ‌రంగ‌ల్ కాక‌తీయ జూ అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి. హైద‌రాబాద్ త‌ర్వాత రాష్ట్రంలో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌లో జూ ను ప్ర‌భుత్వ‌-ప్రైవేటు భాగ‌స్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం చేయాలి.

🪴 అట‌వీ జంతువుల దాడిలో మృతిచెందిన లేదా గాయ‌ప‌డిన వారికి, ప‌శువులు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి త‌క్ష‌ణ‌మే ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. అందుకు సీఎంఆర్ఎఫ్ నుంచి అవ‌స‌ర‌మైన మేర‌కు నిధులు వినియోగించుకోవాలి.

🪴 అట‌వీ శాఖ ప‌రిధిలో చేప‌డుతున్న ర‌హ‌దారులు, ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన అనుమ‌తుల విష‌యంలో అట‌వీ శాఖ‌, ఆయా ప‌నులు చేప‌డుతున్న శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి. కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ నుంచి అనుమ‌తులను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా సాధించాలి.

🪴 అడ‌వుల్లో వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ‌, వాటి క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాల‌న్నింటిని క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ కు అనుసంధానించాలి. అట‌వీ శాఖ‌లో అధికారుల కొర‌త‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి త‌గిన సంఖ్య‌లో ఐఎఫ్ఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్రంతో సంప్ర‌దించాలి.

🪴 అట‌వీ శాఖ‌లో ప్ర‌మోష‌న్లు, ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లను త‌క్ష‌ణ‌మే సిద్ధం చేయాలి. శాఖ‌లో ఉత్త‌మ ప‌ని తీరు క‌న‌బ‌రిచే వారికి అవార్డుల‌ను ఇచ్చే ప్ర‌క్రియ‌ను పున‌రుద్ధ‌రించాలి. ఈ సమావేశంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.