అటవీ పునరుద్దరణ కార్యక్రమం ప్రారంభించిన ‘ఐవోసీఎల్’

తెలంగాణ రాష్త్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పోరేట్ (ఐవోసీఎల్) సోషల్ రెస్పాన్సిబిలిటీలొ భాగంగా జపాన్ లో ప్రజాధరణ పొందిన మియావాకి పద్దతిలో అటవీ పునరుద్దరణ కార్యక్రమాన్నీ జీహెచ్ఎంసీ సహకారంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభకులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ కింద మొక్కలు నాటారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 19 ప్రదేశాల్లో 1711 మొక్కలు నాటారు. అదేవిధంగా 15000 మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు. అంతరించిపోతున్నఅడవుల పునరుద్దరణ దిశగా ప్రముఖ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ముందుకు రావడం సంతోషకరమని ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రానున్నరోజుల్లో మరింతగా విస్తరించి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పెద్ద పెద్ద సంస్థలకు కూడా స్పూర్తినింపి.. తద్వారా పచ్చదనాన్ని పెంచడానికి మరింత దోహదపడుతుందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, పద్మభూషణ్ పుల్లెల గోపిచంద్ ఇతర కార్పొరేటర్లు ఇండియన్ ఆయిల్ సీనియర్ అధికారి ఎస్ఎస్ ప్రసాద్,మనీష్ టస్కర్, సీజీఎం రామ్మోహన్, జోనల్ కమిషనర్ ఎస్.రవి కిరణ్, డెప్యూటి డైరెక్టర్ కే.నీరజ గాంధీ, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.