అంగన్వాడీ సేవల్లో తెలంగాణ అగ్రగామి

  • లబ్ధిదారులకే పోషకాహారం చేరేలా ఫేస్ రికగ్నిషన్ సిస్టంను విజ‌య‌వంతంగా అమలు చేస్తున్న తెలంగాణ‌
  • 75 శాతం ల‌బ్దిదార‌లకు FRS న‌మోదు ద్వారా టేక్ హోం రేష‌న్
  • కేంద్ర పోష‌న్ ట్రాక‌ర్ లో వెల్ల‌డి
  • సిబ్బందిని అభినందించిన మంత్రి సీత‌క్క‌
  • FRS‌ను మరింత విస్తృతంగా అమలు చేయాలని ఆదేశాలు

అంగన్వాడీ సేవల్లో తెలంగాణ మరో ముందడుగు వేసింది. లబ్ధిదారులకు నిజమైన పారదర్శకతతో పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు పోషణ్ ట్రాకర్ యాప్‌లో స్ రికగ్నిషన్ సిస్టం (FRS) ను సమగ్రంగా అనుసంధానం చేసింది. అంగన్వాడీ సిబ్బంది లబ్ధిదారుల వివరాలను మొదటిసారి నమోదు సమయంలో e-KYC, లైవ్ ఫోటో క్యాప్చర్ ద్వారా నమోదు చేస్తారు. ఆ తరువాత ప్రతి నెల టేక్ హోం రేష‌న్ (THR) పంపిణీ సమయంలో ఫేస్ మాచింగ్ ప్రక్రియను అనుసరించి సరైన లబ్ధిదారునికే సరకులు అందజేస్తారు. ఈ విధానం వలన నిజమైన లబ్ధిదారులకే పోషకాహారం చేరుతుంది. పోష‌కాహ‌రం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా అడ్డుక‌ట్ట వేయ‌డంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుంది. తెలంగాణ‌లో అంగ‌న్వాడీల ద్వారా పోష‌కాహ‌రాన్ని మెరుగు ప‌రిచేందుకు ఎన్నో కార్య‌క్ర‌మాలను అమ‌లు చేస్తున్నారు. అయితే ల‌బ్దిదారుల‌కే పోష‌కాహ‌రం అందించాల‌న్న ఉద్దేశంతో FRS విధానాన్ని తెలంగాణ‌లో ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు. మంత్రి సీత‌క్క వ‌రుస స‌మీక్ష‌ల‌తో FRS న‌మోదు శాతం గ‌ణ‌నీయంగా పెరుగుతోంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18,59,978 మంది టేక్ హోమ్ రేషన్ (THR) లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 74.32 శాతం మందికి ఇప్పటికే ఫేస్ రికగ్నిషన్ సిస్టం (FRS) ద్వారా పోషకాహారం పంపిణీ జరుగుతోందని కేంద్ర పోష‌న్ ట్రాక‌ర్ లో వెల్ల‌డైంది. అంటే లక్ష్యిత లబ్ధిదారులే సద్వినియోగం చేసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకతను అమలు చేస్తోంది. ఈ విధానం వలన పాలు, గుడ్లు, బాల‌మృతం వంటి పోషకాహార సరుకులు ఎటువంటి దారి మళ్లింపులు లేకుండా నేరుగా లబ్ధిదారుల చేతికి చేరుతున్నాయి. ప్రభుత్వం దీన్ని ఇంకా విస్తరించి 90 శాతం కవరేజ్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ దిశగా అంగన్వాడీ సిబ్బందిని శిక్షణ ఇచ్చి, సాంకేతిక వనరులను మరింతగా వినియోగించేందుకు చర్యలు ప్రారంభించింది. రాబోయే నెలల్లో మరింత మంది లబ్ధిదారులు ఈ వ్యవస్థలో నమోదు కాబోతున్నారు.

ఈ సంద‌ర్భంగా మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, ఫేస్ రికగ్నిషన్ సిస్టం వలన లబ్ధిదారులకే సరుకులు అందుతున్నాయి. ఇది పోషకాహారం పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చింది. తెలంగాణ ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మా లక్ష్యం 90 శాతం కంటే ఎక్కువ నమోదు సాధించడం. ప్రతి చిన్నారికి, ప్రతి తల్లికి సరైన సమయానికి పోషకాహారం చేరేలా ప్రభుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌లు సానుకూల ఫ‌లితాల‌నిస్తున్నాయి” అని పేర్కొన్నారు. అంగన్వాడీ సేవల్లో FRS వినియోగంతో విశేష ప్రగతిని సాధించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని మంత్రి సీత‌క్క ప్రత్యేకంగా అభినందించారు.