ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క 20-08-2025 న న్యూ ఢిల్లీలో జరిగిన మంత్రుల సమూహం (GoM) సమావేశంలో పాల్గొన్నారు. జీవిత, ఆరోగ్య బీమా సేవలపై జీఎస్టీ తగ్గింపు లేదా మినహాయింపు అంశాన్ని పరిశీలించి సిఫార్సులు చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ ఈ మంత్రుల సమూహాన్ని (GoM) ఏర్పాటు చేసింది. ఇందులో బీహార్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు.
ఈ సమావేశంలో వ్యక్తిగత జీవన బీమా పాలసీలు, వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలు మరియు వాటికి సంబంధించిన రీ-ఇన్సూరెన్స్ పై పన్ను మినహాయింపు ఇవ్వడంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనకు స్వాగతం పలుకుతూ ఉప ముఖ్యమంత్రి, ఈ నిర్ణయం బీమా సాంద్రత (density) మరియు వ్యాప్తి (penetration) పెరగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అయితే, జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా పాలసీలపై పన్ను మినహాయింపు ప్రయోజనం నిజంగా ప్రజలకు చేరేలా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఇది బీమా కంపెనీల లాభాలను పెంచే పరిస్థితి తలెత్తుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు నిజంగా ప్రయోజనం చేకూరినప్పుడే ఈ చర్య లక్ష్యాన్ని చేరుకుంటుందని, అయినప్పటికీ రాష్ట్రాలకు కొంత మేర ఆదాయం నష్టం వాటిల్లి, అది ఇతర సంక్షేమ పథకాలకు వినియోగించదగిన నిధులు తగ్గిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 95 లక్షల కుటుంబాలకు బీమా సేవలు అందజేస్తోందని ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమావేశంలో తెలిపారు.