అంగన్వాడి చిన్నారులకు త్వరలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ : మంత్రి సీతక్క

  • అంగన్వాడి నూతన భవనాల నిర్మాణానికి ఉచిత ఇసుక
  • వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ లో సదుపాయాలను మెరుగుపరుస్తాం
  • మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్: ఎర్ర మంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, జాయింట్ డైరెక్టర్లు, రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు హాజరయ్యారు.

సమావేశంలో నూతన అంగన్వాడి భవనాల నిర్మాణం, అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, సాక్షం అంగన్వాడి, ఆరోగ్యలక్ష్మి, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, చిన్నారులకు యూనిఫాం పంపిణీ, అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు యూనిఫాం చీరల పంపిణీ, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ బలోపేతం, చిన్నారులకు విజయ పాల సరఫరా, బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాం, పాలనా కేంద్రాలు, పోషణ్ అభియాన్ తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడి భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల తరహాలోనే అంగన్వాడి కేంద్రాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంజూరైన 1025 అంగన్వాడి భవనాలలో ఇప్పటివరకు 625 ప్రాంతాల్లోనే స్థలాలు గుర్తించారని.. మిగిలిన ప్రాంతాల్లో స్థల గుర్తింపు తక్షణం పూర్తిచేయాలని సూచించారు. ఒక్కో భవనం నిర్మాణానికి రూ.12 లక్షలు కేటాయించినట్లు గుర్తుచేశారు.

పనుల జాతరలో భాగంగా నూతన భవనాల శంకుస్థాపనలు జరగాలని, ఇప్పటికే పూర్తి చేసిన 22 అంగన్వాడి భవనాలను స్థానిక ఎమ్మెల్యేల చేత ప్రారంభించాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల యూనిఫాం చీరల తయారీ పూర్తై జిల్లా కేంద్రాలకు చేరాయని, వాటిని తక్షణమే పంపిణీ ప్రారంభించాలని తెలిపారు. చిన్నారుల కోసం త్వరలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే హైదరాబాద్‌లోని 139 అంగన్వాడి కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ స్కీమ్ కారణంగా పిల్లల హాజరు 30 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈ అనుభవంతో త్వరలోనే పలు జిల్లాల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను విస్తరించనున్నట్లు వెల్లడించారు.

పిల్లల పోషకాహారాన్ని మెరుగుపరచడం కోసం ప్రతి చిన్నారికి ఉదయం 100 మి.లీ. పాలు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, ప్రతి వారం ఒక రోజు ఎగ్ బిర్యానీ, ఒక రోజు వెజిటేబుల్ కిచిడి వడ్డించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు కూర్చునేలా పంపిణీ చేస్తున్న లాంగ్ టేబుల్స్ ఎత్తు పెంచాలని లబ్ధిదారుల అభిప్రాయాల మేరకు మార్పులు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ సేవలందిస్తున్నాయని, మరో ఐదు హాస్టల్స్ నిర్మాణంలో ఉన్నాయని మంత్రి సీతక్క తెలిపారు. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్‌లో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మరిన్ని సదుపాయాలు కల్పించే దిశగా శాఖ కృషి చేయాలని ఆమె సూచించారు. అంగన్వాడి సేవలను అందించడంలో ఎక్కడా రాజీ పడొద్దు అని అధికారులను ఆదేశించారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా పోషకాహారం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క సిబ్బందిని అభినందించారు. అంగన్వాడీ కేంద్రాలను దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.