కవులకు, కళాకారులకు, ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే – మంత్రి శ్రీనివాస్ గౌడ్

• ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జన్మదిన సందర్భంగా ‘సంక్షేమ స్వరాలు’ పుస్తకావిష్కరణ
• ఒగ్గు కళాకారుడు చెట్టి కొమురయ్యకు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణకు సత్కారం.
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ సారధ్యంలో ఉద్యోగులు, కవులు, కళాకారులను, సాహితీవేత్తలను ఎంతగానో గౌరవిస్తున్నదనీ, వారు చేసిన కృషిని నిరంతరం ప్రోత్సహిస్తున్నదని మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు, ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారాలను మంత్రిగారి కార్యాలయంలో ప్రముఖ ఒగ్గు కళాకారుడు చెట్టి కొమురయ్యకు, ప్రభుత్వ సేవారంగంలో విశిష్ట సేవలందిస్తున్న భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందించి సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మాత్రమే తెలంగాణ కళాకారులకు పట్టాభిషేకం జరుగుతోందని, జానపద గ్రామీణ వృత్తి కళాకారులకు ఎన్నెన్నో అవకాశాలు అందివచ్చాయని, ప్రస్తుతం కళాకారులు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారని మంత్రి అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులను, వారి సేవలను నిరంతరం ప్రశంసించడమే కాక, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉన్న ఉద్యోగులకు విశిష్ట పురస్కారాలు అందిస్తూ గౌరవిస్తోందని చెప్పారు. భాష, సాహిత్య, కళా, సాంస్కృతిక రంగాలలో మామిడి హరికృష్ణ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ విశిష్ట పురస్కారం క్రింద వారికి శాలువా, ప్రశంసాపత్రం, మెమెంటోతోపాటు లక్షా నూటపదహారు రూపాయల నగదు బహుమతిని కూడా ఈ సందర్భంగా మంత్రి అందించారు. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు బాదిమి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే, భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా కళాకారులకు ఉద్యోగాలను కల్పించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ అనీ, ఆ ఖ్యాతి గౌరవ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ కు మాత్రమే దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కార్యాలయములో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ అభివృద్ధి-సంక్షేమ పథకాల మీద రాసిన వేలాది పాటల నుంచి ఎంపిక చేసిన 505 పాటలతో ప్రచురించిన “సంక్షేమ స్వరాలు” పుస్తకాన్ని ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జన్మదిన సందర్భంగా ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో అమలు అవుతున్న ఎన్నెన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాలకు ఈ పుస్తకం ఓ ‘పాటల నీరాజనం’ అనీ, తెలుగు సాహిత్య చరిత్రలోనే 505 పాటలతో సంకలనం చేసిన అతిపెద్ద పాటల గ్రంధం ఇది అనీ ఆయన కొనియాడారు.