భావితరాల కోసం ‘మూసీ’ ప్రక్షాళన చేసి తీరుతాం: మంత్రి శ్రీధర్ బాబు

  • నీటి వనరుల పరిరక్షణలో రోల్ మోడల్ గా తెలంగాణ
  • ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది
  • ఐటీపీఐ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

‘సాధారణంగానే ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరూ కావాలనే అడ్డుపడుతుంటారు. మూసీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. భావి తరాల కోసం ప్రక్షాళన చేసి తీరుతాం. వెనక్కి తగ్గేదే లేదు. నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్ గా నిలుపుతాం’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇన్సిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ) తెలంగాణ స్టేట్ రీజినల్ ఛాప్టర్ ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్ లో ‘పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టూవార్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరాల అభివృద్ధికి సరైన ప్రణాళికే పునాది అని అన్నారు. పర్యావరణం, సుస్థిరత లేకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదన్నారు. భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో కూడిన వృద్ధి ఆవశ్యకమన్నారు. ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది అని నొక్కి చెప్పారు. మనం రూపొందించే ప్రతి విధానం, కాపాడే ప్రతి అడవి, పునరుద్ధరించే ప్రతి నది, సృష్టించే ప్రతి జీవనోపాధి – ఇవన్నీ తరాల మధ్య న్యాయానికి సంకేతాలని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, కార్బన్ – న్యూట్రల్ గ్రోత్, జల సంరక్షణ, సుస్థిర రవాణాలో తెలంగాణ అవలంభిస్తున్న విధానాలు, తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటే సుస్థిరాభివృద్ధితో కూడిన నగరాలను అభివృద్ధి చేయోచ్చన్నారు. వాతావరణ మార్పులు, పట్టణ వరదలు, పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలాల తరుగుదల, పట్టణీకరణ, తరిగిపోతున్న పచ్చదనం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీపీఐ ప్రెసిడెంట్ ఎన్ కే పటేల్, సెక్రటరీ జనరల్ కుల్ శ్రేష్ఠ, కో-ఆర్డినేటర్(టెక్నో అడ్మిన్) ప్రదీప్ కుమార్, ఐటీపీఐ – తెలంగాణ రీజినల్ ఛాప్టర్ ఛైర్మన్ ఎస్.దేవేందర్ రెడ్డి, కార్యదర్శి కె.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.